అభివృద్దికి నిధులు మంజూరు చేయాలి

Jul 3,2024 00:34 ##Parchuru #MLA #Yeluri

– రూ.200కోట్లతో రోడ్ల అభివృద్దికి అంచనాలు సిద్దం
– నూతన అతిధి గృహాల నిర్మాణానికి ప్రతిపాదనలు
– రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్ధన్‌రెడ్డికి ఎంఎల్‌ఎ ఏలూరి వినతి
ప్రజాశక్తి – మార్టూరు రూరల్
పర్చూరు నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఆర్ అండ్ బి రహదారుల విస్తరణ, బీటీ రోడ్ల మరమత్తులు, తారు రోడ్లు నిర్మాణం, జాతీయ రహదారుల నుంచి గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం చేపట్టాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి బిసి జనార్దనరెడ్డికి ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలను, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ రహదారుల అభివృద్ధి, నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు మంగళవారం అందజేశారు. గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సరైన నిర్వహణ లేక రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రోడ్లపై అధికారుల నిర్వహణ లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. తక్షణమే రోడ్ల నిర్మాణం, వైండింగ్‌కు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి జనార్దన్‌రెడ్డి రోడ్లను పరిశీలించి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రోడ్ల ప్రతిపాదనలు ఇలా
నియోజకవర్గంలో 29రోడ్లు రూ.200కోట్లతో నిర్మాణం, వెడల్పు చేపట్టాలని ప్రతిపాదించారు. 216 జాతీయ రహదారి నుంచి మోటుపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణం వైన్డింగ్, 16(5)వ నెంబర్ జాతీయ రహదారి నుంచి నాగండ్ల, కొలలపూడి వరకు బిటి రోడ్డు విస్తరణ, 16వ నెంబర్ జాతీయ రహదారి నుంచి జాగర్లమూడి వరకు బీటీ రోడ్డు విస్తరణ, 16వ నెంబర్ జాతీయ రహదారి నుంచి కొణిదెన వరకు బీటీ రోడ్డు విస్తరణ, 16వ నెంబర్ జాతీయ రహదారి నుంచి గంగవరం వరకు బీటీ రోడ్డు విస్తరణ, 16వ నెంబర్ జాతీయ రహదారి నుంచి నాగరాజుపల్లి వరకు రోడ్డు నిర్మాణం, గుంటూరు – పర్చూరు రోడ్డు విస్తరణ, బ్రిడ్జి నిర్మాణం, బాపట్ల – పర్చూరు రోడ్డు విస్తరణ, ఇంకొల్లు నుంచి పంగులూరు వయా గంగవరం వరకు రోడ్డు ఆధునికరణ, ఇంకొల్లు నుంచి కడవకుదురు రోడ్డు ఆధునికరణ, విస్తరణ, వేటపాలెం నుంచి సంతరావూరు రోడ్డు ప్రత్యేక మరమ్మత్తులు, నాగండ్ల నుంచి అంబటి వారిపాలెం వరకు ఆధునికరణ, పందిళ్ళపల్లి నుంచి కడవకుదురు రోడ్డు వయ మోటుపల్లి రోడ్డు ఆధునికరణ నూతన రోడ్డు నిర్మాణం, పర్చూరు – ఇంకొల్లు రోడ్డు నుంచి సంతరావూరు వయా నాయుడువారిపాలెం మీదుగా జరుబులవారి పాలెం వరకు రోడ్డు ఆధునికరణ, దుద్దుకూరు నుంచి ఈదుముడి వరకు రోడ్డు నిర్మాణం, వీటితోపాటు పలు రోడ్ల ఆధునికరణ, మరమ్మత్తులు చేపట్టాలని కోరారు.
నూతన అతిథి గృహాలకు ప్రతిపాదనలు
నియోజకవర్గంలో మార్టూరు, ఇంకొల్లు, చిన్నగంజాం మండల కేంద్రాల్లో నూతన ఆర్ అండ్ బి అతిథి గృహాలు నిర్మించాలని మంత్రి బీసీ జనార్దనరెడ్డికి ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు ప్రతిపాదనలు అందజేశారు. పర్చూరులోని పాత ఆర్ అండ్ బి అతిధి గృహానికి మరమ్మత్తులు చేసేందుకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల పర్యటనల నేపథ్యంలో విశ్రాంతి తీసుకొనుటకు, పాలనా పరమైన అంశాలు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు అనువైన భవనాలు లేనందున అతిథి గృహాల ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు.

➡️