విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్‌

– పట్టణంలో అపూర్వ ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు
– పాత బస్టాండ్ సెంటర్ నుండి బంగ్లా రోడ్డు వరకు కాలినడకన ప్రజలకు అభివాదం చేసిన గొట్టిపాటి
– భారీగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
ప్రజాశక్తి – అద్దంకి
గొట్టిపాటి రవికుమార్ భారీ మెజార్టీతో ఐదవ సారి ఎంఎల్‌ఎగా గెలుపొందారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో గొట్టిపాటి రవికుమార్ రూపంలో అద్దంకి నియోజకవర్గానికి తొలిసారి మంత్రి పదవి దక్కింది. దీంతో వేల సంఖ్యలో టిడిపి శ్రేణులు, అధికారులు అభినందనలు తెలిపేందుకు చేరుకున్నారు. స్థానిక పాత బస్టాండ్ సెంటర్లోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి, బంగ్లా రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. నాగులపాడు రోడ్డులోని కామేపల్లి కళ్యాణ మండపంలో ప్రజలతో ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహించారు. మంత్రి పదవి దక్కిన సందర్భంగా గొట్టిపాటి రవికుమార్‌కు అభినందనలు తెలిపారు. గతంలో ప్రభుత్వ అధికారులు, పోలీసులు, శాసన సభ్యులుగా గొట్టిపాటి రవికుమార్ కొనసాగినప్పటికీని పలకరించిన పాపాన పోలేదని పలువురు టిడిపి నాయకులు అన్నారు. నేడు అధికారులు, పోలీసు యంత్రాంగం ఆయన చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. కాల మహిమ ఎంతటి వారినైనా అధికారమొస్తే అధికారులు ప్రదక్షణలు చేస్తారని నిరూపితం అవుతుందని తెలుగుదేశం శ్రేణులు బహిరంగంగానే చర్చిస్తున్నారు. అద్దంకి నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఉద్దండులు శాసన సభ్యులుగా ఎన్నికైనప్పటికి మంత్రి పదవి దక్కలేదు. గొట్టిపాటి రవికుమార్ రూపంలో మంత్రి పదవి రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత గొట్టిపాటి రవికుమార్‌కు విద్యుత్ శాఖ కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనితో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశ నాయకులు, అంగనవాడి కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️