ఇమామ్‌లకు వేతనాలు ప్రభుత్వమే ఇవ్వాలి

Jun 16,2024 23:16 ##Battiprolu #Muslim

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మసీదుల్లో పనిచేసే మౌజు, ఇమామ్‌లకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు అందించేందుకు నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఇమామ్‌లు కోరుతున్నారు. గతంలో తెలుగుదేశం పాలనలో మౌజులకు రూ.3వేలు, ఇమామ్‌లకు రూ.5వేలు వేతనం ఉండగా దానిని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మౌజులకు రూ.5వేలు, ఇమామ్‌లకు రూ.10వేలకు పెంచారని గుర్తు చేస్తున్నారు. ఈ వేతనాలు నేరుగా మసీదు పెద్దలకు చెందిన ఖాతాల్లో జమవుతూ ఉంటాయి. ఈ సొమ్మును మసీదు పెద్దలు డ్రా చేసి వీరికి అందిస్తూ ఉంటారు. కానీ మసీదు పెద్దలు వీరికి అందించే వేతనాన్ని సకాలంలో, సక్రమంగా అందించకుండా వారి అవసరాలకు కొంత వినియోగించుకొని పూర్తిస్థాయి వేతనం ఇవ్వకుండా 50శాతం వేతనం మాత్రమే అందిస్తున్నారని మసీదుల్లో పనిచేసే మౌజు, ఇమామ్‌లు ఆరోపిస్తున్నారు. వైసీపీకి చెందిన ముస్లిం నాయకులు మత పెద్దలుగా ఉంటూ ప్రభుత్వం నుండి విడుదలయ్యే సొమ్మును పూర్తిస్థాయిలో వేతనాలు అందించకపోవటమే కాక ప్రభుత్వం ఇచ్చిన వేతనాన్ని తమకు జమ చేయాలని అడిగే వారిని బలవంతంగా, నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మసీదులో పనిచేస్తున్న తమకు వేతనాన్ని పెంచిన ఆనందం అప్పటికి స్థానిక నాయకుల ప్రభావంతో లేకుండా పోయిందని చెబుతున్నారు. పెంచిన వేతనం పూర్తిగా చేతికి ఇవ్వకుండా సగమే ఇవ్వటం, అడిగితే మీ ఇష్టమైతే చేయండి లేకుంటే బయటికి వెళ్లిపోండి అంటూ నాయకులు హెచ్చరించారని వాపోతున్నారు. మండలంలోని భట్టిప్రోలు, అద్దేపల్లి గ్రామాల్లో నాలుగు మసీదులు, వేమవరం, పల్లికోన, వెల్లటూరు గ్రామాల్లో ఒక్కొక్క మసీదు చొప్పున మొత్తం ఏడు మసీదులు ఉన్నాయి. ప్రతి మసీదుకు ఇరువురు వ్యక్తులు ఇమామ్, మౌజులుగా పనిచేస్తుంటారు. వైసిపి పాలనలో వీరందరి పరిస్థితి అదే రీతిలో ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం మూడు, నాలుగు నెలలకు ఒకసారి వేతనాలను మసీదు ఖాతాల్లో జమ చేయడంతో దానిని తమ ఖాతాలకు ఇవ్వాలని అడిగిన పాపనికి తనను పూర్తిగా తొలగించారని భట్టిప్రోలు గ్రామానికి చెందిన మౌజు ఇస్మాయిల్ బేగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నూతన ప్రభుత్వం మసీదుల్లో పనిచేసే మౌజు, ఇమామ్‌లకు అందించే వేతనం మసీదు ఎకౌంటుకు కాకుండా నేరుగా తమకే జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️