జగనన్న కాలనీ గృహ నిర్మాణాలు లేనట్టేనా?

May 23,2024 22:48 ##Battiprolu #Jagan

ప్రజాశక్తి – భట్టిప్రోలు
ప్రభుత్వం పేదలకు కేటాయించిన నివేశన స్థలాల్లో నిర్మించుకుంటున్న గృహాలు బేస్ మెంట్ స్థాయికే పరిమితం అయ్యాయి. గత నాలుగేళ్లుగా జగనన్న కాలనీలో గృహాలు నిర్మించుకునేందుకు లబ్ధిదారులకు సరైన వసతులు లేక గృహ నిర్మాణాలు ముందుకు సాగలేదు. గృహ నిర్మాణ శాఖ అధికారులు, జిల్లా ఉన్నత స్థాయి అధికారులు పదే పదే లబ్ధిదారులకు అవగాహన కల్పించి, రకరకాల ఆశలు చూపించినప్పటికీ నిర్మాణాలకు లబ్దిదారులు ఆసక్తి చూపలేదు. లబ్ధిదారులకు అందించే బిల్లులు సరిపడే పరిస్థితి లేకపోవడంతో అప్పులు చేసి గృహాలు నిర్మించుకోలేక అనేక మంది నిర్మాణాలను చేపట్టలేకపోయారు. కొంత మంది అద్దె గృహాల్లో నివసించేవారు అప్పులు చేసి మరీ అధికారుల వత్తిడికి తట్టుకోలేక అరకొరగా నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ అవి ముందుకు సాగక ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి. ఈ ఏడాది వేసవి కాలం సమీపించిన సమయంలో గృహ నిర్మాణాలు చేపట్టుకునేందుకు ఎన్నికల నిబంధనలు అమలులోకి రావడం, దానికి ముందుగానే గృహ నిర్మాణ బిల్లులు మంజూరు కాకపోవడం వంటి సమస్యలతో నిర్మాణాలు నిలిచిపోయాయి. మండలంలో 2700 మందికిపైగా లబ్ధిదారులకు నివేశన స్థలాలు కేటాయించారు. వీటిలో ప్రధానంగా భట్టిప్రోలులో 1100 మంది లబ్ధిదారులకు స్థలాలు ఇచ్చారు. ఇచ్చిన స్థలాలు పూర్తిగా పల్లపు ప్రాంతాలు కావడంతో గృహ నిర్మాణాలు చేపట్టేందుకు అనువుగా లేవు. దీంతో అనేకమంది లబ్ధిదారులు ముందుకు రాలేదు. స్థలాల్లో మెరకలు తోలించాలని, రహదారులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ స్థానిక నాయకులే వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా చేతివాటం చూపడంతో మెరకలు కూడా పూర్తిగా తోలలేదు. ప్రస్తుతం వర్షాలు ప్రారంభమై కాలనీలో ఎక్కడికి అక్కడ వర్షపు నీరు నిలబడటంతో గృహ నిర్మాణాలు చేపట్టాలనుకున్న లబ్ధిదారులకు మెటీరియల్ వెళ్లే మార్గం లేక నిర్మాణ పనులను చేపట్టలేకపోతున్నారు.


రోడ్డు కూడా లేకుండా నిర్మాణాలు ఎలా చేయగలం
నిరుపేదలకు జగన్మోహన్‌రెడ్డి నివేశన స్థలాలు ఇవ్వడం అభినందనీయమే. కానీ ఆ స్థలాలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయటంలో విఫలం చెందారనే ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టి నివాసం ఉండటానికి అవసరమైన రహదారుల నిర్మాణం, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం వంటి కనీసం వసతులు ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు తప్ప అనేక కాలనీలో రహదారుల నిర్మాణం, త్రాగునీటి వసతి లేకపోవటంతో గృహా నిర్మాణాలు చేపట్టలేకపోతున్నమని లబ్ధిదారులు వాపోతున్నారు. గృహ నిర్మాణానికి ప్రభుత్వం అందించే రూ.1.80లక్షలు పునాదికి సరిపోవటం లేదని చెబుతున్నారు. గృహనిర్మాణ నిధులు రూ.3లక్షలపైగా పెంచితే తప్ప గృహా నిర్మాణాలు చేయలేమని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు వెలువడి నూతన ప్రభుత్వం ఏర్పడే నాటికి వర్షాలు ప్రారంభమయ్యే పరిస్థితిలో ఉన్నాయని, వీటి దృష్ట్యా ఈ ఏడాది జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశాలు కనిపించడం లేదని లబ్దిదారులు చెబుతున్నారు.

➡️