భూ హక్కు చట్టం రద్దుపై న్యాయవాదుల హర్షం

Jun 15,2024 00:12 ##Addanki #Advocats

ప్రజాశక్తి – అద్దంకి
ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం 2023 రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు న్యాయవాదులు 100 రోజులకుపైగా ఉద్యమాలు, ఆందోళనలు చేశామని బార్‌ అసోసియేషన్ అధ్యక్షులు మురకొండ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా విరుద్ధమైన చట్టాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు రద్దు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణలో కేక్ కట్ చేసి నూతన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు కరి రామకృష్ణారావు, పంచాగ్నుల ఉదయభాస్కర్, వడ్లవల్లి వీరనారాయణ, జి శ్రీనివాసరావు, మహిళా న్యాయవాదులు కాకాని నాగేంద్రమ్మ పాల్గొన్నారు.


భట్టిప్రోలు : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఇబ్బందికరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయటం హర్షనీయమని సిపిఐ నాయకులు, న్యాయవాది పి నాగాంజనేయులు అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ దుర్మార్గపు యాక్ట్ చట్ట విరుద్ధంగా ఉందని, దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 3నెలల పాటు నిరవధిక నిరాహార దీక్షలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పేదలు, రైతులు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను దుర్మార్గుల చేతికి అప్పగించేందుకు జగన్మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన యాక్టు రద్దు చేయాలని న్యాయవాదులు కోర్టులను సైతం బహిష్కరించి న్యాయ పోరాటం చేశారని అన్నారు. ఆ యాక్టును రద్దు చేస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం రద్దుకు సంతకం చేయడం అభినందనీయమని అన్నారు. సిపిఐ నాయకులు జి బాలాజీ మాట్లాడుతూ వృద్ధులకు రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు పెన్షన్‌ పెంపుదల చేసేందుకు సంతకం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తారని ఆయన ఆశ బాగా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు బండారు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️