ఉరితాళ్లతో మున్సిపల్‌ కార్మికుల నిరసన

Dec 29,2023 23:24

ప్రజాశక్తి – చీరాల
మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు సీఐటీయు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారంకు 8వ రోజుకు చేరుకుంది. ఈ నేపధ్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా శిభిరంలో కార్మికులు ఉరితాళ్లతో నిరసన తెలిపారు. పారిశుధ్య కార్మికులు చేస్తున్న పోరాటానికి ఇంజనీరింగ్ విభాగ కార్మికులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ అధ్యక్షులు ఎన్ బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో నిర్వహించిన చర్చల్లో కార్మికుల న్యాయమైన డిమాండ్ల పట్ల సానుకూలమైన నిర్ణయం వస్తుందని ఆశించినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైన స్పష్టమైన హామీ రాని కారణంగా కార్మికులు నిరాశ చెందారని తెలిపారు. కార్మికులకు ఇవ్వవలసిన సమాన పనికి సమాన వేతనం, పర్మినెంట్, సంక్షేమ పథకాల అమలు తదితర డిమాండ్లపై స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలపై దిగి వచ్చేవరకు సమ్మె, పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ పట్టణ అధ్యక్షులు నూతలపాటి రాజు, కార్యదర్శి ఎండ్లూరు సింగయ్య, కోశాధికారి మానికల శంకర్, గూడూరు కోటేశ్వరి, బడుగు కుమారి, బి విజయమ్మ, తిరుపతమ్మ, యశోద, సుబ్బమ్మ, గూడూరు శిరీష, పద్మ పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు చేసిన పోరాటానికి ఇంజనీరింగ్ కార్మికులు జేఏసీ నాయకులు చిమటా వీరస్వామి, ఎస్‌కె బాజీ బాబు మద్దతు తెలిపారు.


అద్దంకి : పారిశుద్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ విధి లేని పరిస్థితుల్లో సమ్మెబాట పట్టారని వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నాచేపట్టిన మున్సిపల్‌ కార్మికులు 4వ రోజు మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అధికారానికి వస్తే మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను ఆప్కాస్ పరిధిలోకి తీసుకువచ్చి కార్మికులను అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నారని అన్నారు. నాలుగున్నరేళ్ల నుండి కార్మిక సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడం ఏమిటని ప్రశ్నించారు. వీధులు శుభ్రం పరచాలంటే కార్మికుల అవసరమైనప్పటికీ వారి సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించడం మంచిది కాదని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల యూనియన్ నాయకులు పి ఆదాం, భీష్మ, అంజమ్మ, మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

➡️