సమాన వేతనం కోరుతు మున్సిపల్ కార్మికుల ధర్నా

Dec 24,2023 00:05

ప్రజాశక్తి – బాపట్ల
సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగుల పర్మినెంట్ కోరుతూ మున్సిపల్ కార్మికులు శనివారం ధర్నా చేశారు. సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీని సిఎం మర్చిపోయారని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని, ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. అనేక దఫాలుగా ప్రభుత్వానికి విన్నవించిన స్పందన లేక పోవడంతో ఈనెల 26నుండి మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదన్నారు. పట్టణాల్లో ప్రజలకు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు ఎనలేని సేవలు అందిస్తున్నారని అన్నారు. నీటిసరఫరా, విద్యుత్, పార్కుల నిర్వహణ, పారిశుద్ధ్యం లాంటి పనుల్లో మున్సిపల్ కార్మికులు ఎంతో బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారని అన్నారు. అయితే వారి శ్రమను ప్రభుత్వం గుర్తించడం లేదని అన్నారు. ప్రభుత్వం ప్రతిస్పందించి ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ కార్మికుల యూనియన్ నాయకులు అంకమ్మరావు, అశోకు, సూర్య, మురళి, శంకర్‌, హరిబాబు, ప్రమీల, సిఐటియు నాయకులు తిరుమలరెడ్డి, ఎం కుమార్ పాల్గొన్నారు.

➡️