తెలుగు మహాసభల కరపత్ర ఆవిష్కరణ

Dec 28,2023 00:34

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌
జనవరి 5, 6, 7తేదీల్లో రాజమహేంద్రవరంలో జరుగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభల కరపత్రాన్ని మడగాస్కర్ దేశ భారత రాయబారి, కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ జాయింట్‌ కమిషనర్‌ బండారు రత్న కిషోర్ మండలం ఇడుపులపాడులో బుధవారం ఆవిష్కరించారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలుగు మహాసభలకు హాజరు కావాలని కోరారు. మహాసభల జిల్లా సంచాలకులు పిడపర్తి పేరిరెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషా వైభవాన్ని, తెలుగు జాతి సంస్కృతీ, సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటే విధంగా మూడు రోజుల పాటు జరిగే మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సభల్లో గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్ నిర్వహణలో ఆంధ్ర సారస్వత పరిషత్తు సంచాలకులు కేసిరాజు రామప్రసాద్ పర్యవేక్షణలో సాహితీ ప్రక్రియలపై సదస్సులు, కవిసమ్మేళనం, కథా పఠనం, సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలు వంటి అనేక కార్యక్రమాలు వుంటాయన్నారు. 70దేశాల నుండి ప్రతినిధులు, లక్షల మంది సాహితీ ప్రియులు పాల్గొంటారని తెలిపారు. నాలుగు రాష్ట్రాల గవర్నర్లను, రెండు తెలుగు రాష్ట్రాల సిఎంలను, మంత్రులను, పీఠాధిపతులను, సాహితీవేత్తలను ఆహ్వానించామని తెలిపారు. కార్యక్రమంలో అంబటి సురేష్, కంభాలపాటి నరసయ్య పాల్గొన్నారు.

➡️