నిబందనలు తూచ్‌

Mar 20,2024 23:50

ప్రజాశక్తి – అద్దంకి
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన పోస్టర్లు అన్నీ తొలగించారు. శిలాఫలకాలపై సిఎం, ఇతర మంత్రులు, ఎంఎల్‌ఎల పోస్టర్లు ఉండటంతో వాటినీ కనిపించకుండా పేపర్లు అంటించారు. నేతల విగ్రహాలకు ముసుగులు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులు ఎన్నికల నియమావళిని అమలు చేస్తుంటే అద్దంకిలో మాత్రం గాలికి వదిలేశారు. సింగరకొండ రోడ్డులోని విద్యుత్తు కార్యాలయంలో సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఫోటోలతో రైతులకు సంబంధించిన విద్యుత్తు అంశాలపై ప్రభుత్వం ప్రచురించిన గోడ పత్రికను తొలగించకుండా అలాగే ఉంచారు. ఈ గోడపత్రిక చూసిన ప్రజలు విద్యుత్ అధికారులకు నియమావళి వర్తించదాని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ శాఖ డిఈ, ఎడిఈ, ఎఈలు గతంలో అనేకసార్లు విద్యుత్ స్థంభాల సమస్య పరిష్కరించాలని కోరినప్పటికీ పరిష్కరించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల నియమావళి వచ్చిన అనంతరం కొందరి మెప్పుకోసం విద్యుత్ అధికారులు తమ ఇష్టం వచ్చిన రీతిలో స్తంభాలు కొత్తవి అమర్చడం, వైర్లు బిగించడం వంటి చర్యలు చేపడుతున్నారని పట్టణ ప్రజలు చర్చిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️