ఏడాదికాలంగా జీతాలు లేవు : ప్రకృతి వ్యవసాయం సిబ్బంది ఆవేదన

Feb 4,2024 22:18

ప్రజాశక్తి – భట్టిప్రోలు
రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతిలో లభించే ఆకులు, అలములతో కషాయాలు తయారు చేసుకుని వ్యవసాయానికి వినియోగిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు అవగాహన కల్పించే ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఏడాది కాలంగా జీతాలు రావడంలేదు. ఈ రంగంలో పనిచేసే సిబ్బందిని మండల సమైక్యకు అనుబంధంగా డ్వాక్రా మహిళలతో పనులు చేపడుతూ ఉంటారు. వీరు 2008నుండి ఎన్‌పిఎం కింద పదేళ్లపాటు పని చేసి 2018నుండి జెడ్‌బిఎన్ఎఫ్ (ప్రకృతి వ్యవసాయం) కింద పనిచేస్తున్నారు. వీరిలో ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3, ఎంటి (మాస్టర్ ట్రైనర్)గా పనిచేస్తున్నారు. వీరిని ఒక మండలం నుండి మరొక మండలానికి బదిలీ చేశారు. వీరికి అందించే వేతనం ఆయా క్యాటగిరీని బట్టి రూ.9వేల నుండి రూ.22వేల వరకు ఉంటుంది. వీరు స్థానిక మండలంలో పనిచేస్తే ఒక జీతం పక్క మండలానికి వెళ్లి పని చేస్తే మరో రకంగా వేతనం ఉంటుంది. పక్క మండలానికి వెళ్లి ప్రతిరోజు పనిచేయడానికి రోజుకు రూ.రెండు నుండి రూ.మూడు వందల వరకు రవాణా, భోజన వసతి ఖర్చులు అవుతూ ఉంటాయి. ప్రతిరోజు వీరు పని చేసే మండలంలో ఏదో గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న ఐకెపి సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో కలిసి వివిధ రకాల పంటల సాగు రైతులు తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కొనసాగే ఈ ప్రాజెక్టులో పనిచేసే వందలాదిమంది సిబ్బందికి ఏడాదికాలంగా వేతనాలు లేకపోతే ఏ విధంగా పనిచేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లాలోని సుమారు 600మందికిపైగా ప్రకృతి వ్యవసాయం రంగంలో పనిచేస్తూ వేతనాలకు దూరమయ్యామని వాపోతున్నారు.
పనిచేయలేక పోతే మానేయండని బెదిరింపులు
వేతనాలు వచ్చేనాటికి వస్తాయి. అయినప్పటికీ మీకు అప్పగించిన పనిని తూచా తప్పకుండా పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుండి ఒత్తిడికి లోనవుతున్నామంటూ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే రంగంలో పనిచేస్తున్న తమకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోగా జీతాలు అడిగితే పనిచేస్తే చేయండి, ఇష్టం లేకపోతే మానేయండి అంటూ అధికారుల నుండి ఒత్తిడి పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు లేకుండా తాము పక్క మండలానికి ప్రతిరోజు అప్పులు చేసి ప్రయాణ ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఒక్కో కుటుంబం వేతనాలు అందకపోవటంతో పస్తులు కూడా ఉంటున్న సంఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భట్టిప్రోలు మండలంలో సుమారు 25మంది వరకు ఉన్నారు. వేతనం లేకుండా ఏ విధంగా పని చేయాలంటూ అడిగిన పాపానికి ఇటీవల గుర్రం శ్రీనివాసరావు అనే ఎల్‌1ను జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నిర్దాక్షిణ్యంగా, బలవంతంగా రాజీనామా చేయించిన ఘటన జరిగినట్లు సిబ్బంది వివరిస్తున్నారు.
వ్యవసాయ రంగంపై చిత్తశుద్ధి ఇదేనా?
ప్రస్తుత వైసిపి పాలనలో వ్యవసాయ రంగం పట్ల చిత్తశుద్ధి లోపించి పని భారం పెరగటం, వేతనాలు సకాలంలో అందకపోవటం వంటి కారణాలతో వ్యవసాయ రంగంలో పనిచేసే సిబ్బంది ఒత్తిడికిలోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రబీకి మాగాణి భూముల్లో మినుము, పెసర, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేసి ఉండగా దీనిలో అంతర పంటలు వేయించాలని జిల్లా అధికారులు వత్తడి చేస్తున్నారని, ప్రస్తుతం ఈ విధానం సాధ్యపడదని చెప్పినప్పటికీ మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారని పాపోతున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అవుతూనే ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందికి అందించాల్సిన వేతనాలు మాత్రం జమ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు రావాల్సిన బకాయిలు అందజేసి, ప్రతినిలా వేతనాలు అందే విధంగా చూడాలని, ఉన్నతాధికారుల నుండి పని ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు.

➡️