మురుగు పారదు. చెత్త తొలగించరు

Jun 15,2024 00:22 ##Chirala #Municipality

– ప్రభుత్వం మారిన పనితీరు మరేనా…?
– పట్టీ పట్టనట్లుగా మునిసిపల్ అధికారులు
– దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
– కారంచేడు రోడ్డులో ముక్కు మూసుకొని ప్రయాణం
ప్రజాశక్తి – చీరాల
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది పట్టణంలో పారిశుధ్య పరిస్థితి. పట్టణంలోని వివిధ వార్డుల్లో చెత్త తొలగించడంలేదు. దీంతో ఆయా వార్డుల్లో ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ఓవైపు వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పేరుకుపోయిన చెత్తనంతటిని రోడ్డు మీదకు తీసుకురావడంతో దుర్వాసన మరింతగా వెదజల్లుతుంది. పట్టణంలోని గోశాల, వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ప్రధాన రహదారిపై పేరుకుపోయిన చెత్త తొలగించకపోవడంతో ఆ ప్రాంతవాసులు రోడ్ల వెంట ఉండే ఆవులు, కుక్కలు చెత్తను రోడ్డుపైకి తీసుకొస్తుండటంతో మరింత దుర్వాసన వస్తుంది. తెల్ల గాంధీ బొమ్మ సెంటర్‌లోని గంగమ్మ గుడి వద్ద కాలవలు పూడిక తీయడంలేదు. చెత్త తొలగించడం లేదని ఆ ప్రాంతం వాసులు అంటున్నారు. పట్టణంలో డ్రైనేజీ పారుదల అస్తవ్యస్తంగా ఉండడంతో విజిలిపేటలో రోడ్ల వెంట మురికి నీరు నిలబడి రోగాలకు నిలయంగా మారుతుంది. నిత్యం ఆ ప్రాంతవాసులు మురికి నీరు కాలువలు నిండిపోవడంతో బకెట్లతో నీరు తోడి బయట పారబోసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మురుగునీరు పారుదల లేక చిన్నపిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడే పరిస్థితులు ఉన్నాయని, అందుకు ప్రధాన కారణం డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక పోవటమేనని ఆ ప్రాంతం మహిళలు అంటున్నారు. పట్టణంలోని వివిధ హాస్పిటల్స్ నుండి చెత్త పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు ఆ హాస్పటల్ బయట ఉన్న వ్యర్ధాలను తొలగించడం మాత్రం అలసత్వం వహిస్తున్నారని కొందరు అంటున్నారు. చీరాల నుండి కారంచేడు వెళ్లే రహదారిలో మంచినీటి చెరువు ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా వ్యర్థాలు వేస్తూ మున్సిపల్ అధికారులు డంప్ యార్డును తలపిస్తున్నారు. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు ముక్కు మూసుకుంటేనే ప్రయాణం చేయగలిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దారి పొడుగుతున్న దుర్వాసన వెదజల్లుతుంది. చనిపోయిన మూగజీవాల కళేబారాలు, ఇతర వ్యర్ధాలుతో ముక్కులు పగిలేలా వస్తున్న దుర్వాసనతో ఆ మార్గంలో ప్రయాణించే ముందే ముక్కులకు కర్చీపులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని బాటసారులు, వాహనదారులు అంటున్నారు. దండుబాట రోడ్డులో పారిశుధ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్రైనేజీ పారుదల లేక మరుగునీరు ఇళ్లల్లోకి చేరుతుంది. ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కాస్త వర్షం పడితే చాలు ఇళ్లల్లోకి మురికి నీళ్లు చేరే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మారిన ప్రభుత్వమైనా చీరాలలో పారిశుద్ధం పరిస్థితి మార్చుతుందా? అనే సందేహం ఆయా ప్రాంతవాసులు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి పారిశుద్ధ్యం, డ్రైనేజీ పారుదల మెరుగుదలపై దృష్టి సారించి ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుతున్నారు.

➡️