అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Dec 4,2023 23:45

ప్రజాశక్తి – రేపల్లె
వరి రైతుపై వరుణుడు విలయం సృష్టిస్తున్నాడు. భారీ వర్షం, గాలి వానకు వరి సాగు చేసిన రైతులు బెంబేలెత్తుతున్నారు. చేతికి వచ్చిన పంట వర్షపునీటిలో నేలపై వాలింది. వాయుగుండం ప్రభావం వల్ల వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో అన్నదాత వెన్నులో వణుకు మొదలైంది. మిచాంగ్ తుఫాను ప్రభావంతో తెల్లవారు జామున పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్ముకున్నాయి. దీనికి తోడు చల్లని గాలులు తోడవడంతో పంట నేల వాలడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టాలో చాలా చోట్ల వరి పంట కోశారు. మరికొన్ని చోట్ల యంత్రాలతో కోసి పరదాలపై వడ్లు ఆరబోశారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులకు గురైనా బాగా పండింది. పంట చేతికొచ్చి కష్టాలు తీరతాయని రైతులు భావించారు. ప్రస్తుతం పొంచి ఉన్న వాయుగుండం ముప్పు తమ ఆశలపై నీళ్లు చల్లిందని రైతులు కలత చెందుతున్నారు. మండలంలో 12వేల హెక్టార్లలో రైతులు ఖరీఫ్ సాగు చేశారు. ఎకరాకు 30నుంచి 45బస్తాల వరకు దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. వివిధ గ్రామాల్లో 35శాతం వరకు పంట కోసి పొలాల్లో పనలుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రకృతి ప్రకోపిస్తే ఎకరాకు రూ.35వేల వరకు పెట్టుబడి తోపాటు ఆరుగాలం శ్రమ నీటి పాలవుతుందని భయాందోళన చెందుతున్నారు. కోస్తాలో సాధారణంగా ఏటా అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాల్లో తుపానులు సంభవిస్తుంటాయి. నాలుగేళ్లుగా ఇదే సమయంలో రైతులను ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. దీంతో వరి రైతులకు నవంబరు, డిసెంబరు నెలలంటేనే భయం పట్టుకుంది. పంట చేతికందే పరిస్థితుల్లో వాతావరణంలో మార్పులు తీవ్ర నష్టాలను గురి చేస్తున్నాయి. తుఫాను ప్రభావం అధికంగా ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దారు సూచించారు. తీర ప్రాంత గ్రామాల్లో పునరావాస కేంద్రాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. డిసెంబర్ 5వరకు అత్యధిక వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉండటం, 50నుంచి 75కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించి క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి ప్రతి క్షణం ఎంతో బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. తుఫాన్ తీవ్రత పట్ల అవగాహనతో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. డిసెంబర్ 4, 5తేదీల్లో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల తల్లులు, వయో వృద్దులు ఇల్లు విడిచి బయటకు రావద్దని అన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది గ్రామ సచివాలయం వద్ద అందరికీ అందుబాటులో ఉండాలని అన్నారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టామని అన్నారు. తహశీల్దారు వెంట మున్సిపల్ కమిషనర్ బి విజయసారథి, ఏడిఏ సయ్యద్ అక్తర్ హుస్సేన్, ఏఒ వాగోలు బుష్ పాల్గొన్నారు.

➡️