గ్రామీణ అభివృద్దికి పవన్‌కళ్యాణ్‌ కృషి చేయాలి : సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మోహన్

Jun 15,2024 00:07 ##Bapatla #cpm

ప్రజాశక్తి – బాపట్ల
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి తోపాటు సర్పంచుల సమస్యల పరిష్కారానికి తొలిసారిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పదవి చేపట్టిన పవన్ కళ్యాణ్‌కు సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టి కృష్ణమోహన్ శుక్రవారం అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామ పంచాయతీలను తిరిగి మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించడం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక సంఘం నిధులను గత ప్రభుత్వం పక్కదోవ పట్టించి పంచాయతీల్లో కనీసం సౌకర్యాలు, బ్లీచింగ్‌కు సైతం నిధుల్లేకుండా చేశారని అన్నారు. సచివాలయాలను తీసుకొచ్చి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచులకు విలువ లేకుండా గత ప్రభుత్వం చేసిందని అన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో సర్పంచుల సమస్యలపై రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సర్పంచులు, గ్రామీణ ప్రాంత సమస్యలను ఆయనకు వివరించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ సంప్రదింపులు జరిపి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు రావలసిన నిధులు విడుదలకు కృషి చేసి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని కోరారు.

➡️