విజయవాడకు తరలివెళ్లిన ప్రజలు

Jan 19,2024 23:57

ప్రజాశక్తి – బాపట్ల రూరల్ప్ర

భుత్వం ఏర్పాటు చేసిన 125అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. విజయవాడలో విగ్రహావిష్కరణకు మద్దతుగా పట్టణంలో భారీ ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పర్చూరు : విజయవాడలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు మండలంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు తరలివెళ్ళారు. వైసీపీ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో కార్లు, ఆర్టీసీ బస్సుల్లో అంబేద్కర్ స్మృతి వనానికి బయలుదేరి వెళ్లారు. బస్సుల్లో వెళ్లే వాళ్లకు భోజన వసతిని కూడా ఏర్పాటు చేశారు. విజయవాడ నగర నడిబొడ్డున రూ.404కోట్లతో 125అడుగుల భారీ విగ్రహాన్ని సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఇంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. దేశంలో ఉన్న ఎత్తైన విగ్రహాల్లో ఇది మూడవది.
కొల్లూరు : విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కంచు విగ్రహాన్ని సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆవిష్కరించే కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి బస్సుల్లో ప్రజలు జై భీమ్ నినాదాలతో తరలి వెళ్లారు.
వేమూరు : విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వివిధ మండలాల నుండి ప్రజలు తరలి వెళ్లారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయగా మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైసిపి నాయకులు ప్రజలను బస్సుల్లో ఎక్కించే ప్రయత్నాలు చేశారు. అమితు అధిక శాతం మహిళలను తరలించడం విశేషం. సామాన్య మధ్యతరగతి ప్రజలు వ్యవసాయ పనిలో ఉండటంతో బస్సులను నింపేందుకు తంటాలు పడ్డారు. ఎంపీడీఒలు, ఎంపీపీలు దగ్గరుండి బస్సు ఎక్కించారు.

➡️