విద్యార్ధి సమస్యలపై ఆనందబాబుకు వినతి

ప్రజాశక్తి – కొల్లూరు
మండలంలోని విద్యార్ధులకు ఇంటర్ విద్యను అందించిన జివిఎస్ఆర్ అండ్ ఎఎస్ఆర్ కళాశాలను తిరిగి ఎయిడెడ్‌గా కొనసాగించాలని, ప్రభుత్వ లెక్చరర్లను నియమించాలని కోరుతూ ఎమ్మెల్యే నక్క ఆనందబాబుకు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పి మనోజ్ కుమార్ సోమవారం కొల్లూరులో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి మనోజ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న ఎయిడెడ్ కళాశాల వ్యవస్థలను రద్దు చేయడం వలన పేద విద్యార్థులకు ఉచిత విద్య దూరమైందని అన్నారు. రూ.వేల ఫీజులు చెల్లిస్తూ ఇంటర్ విద్య చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అందువలన జివిఎస్ఆర్ అండ్ ఎఎస్ఆర్ జూనియర్ కళాశాలను ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలని కోరారు. ఎంఎల్‌ఎ ఆనందబాబు మాట్లాడుతూ నాటి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని అన్నారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను రద్దు చేయడం వలన పేదలు ప్రభుత్వ విద్యకు దూరమయ్యారని అన్నారు. కొల్లూరు కళాశాల విషయమై ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రితో మాట్లాడతానని ఎస్ఎఫ్ఐ నాయకులకు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొనిగల సుబ్బారావు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

➡️