పోరంబోకు భూములకూ నష్టపరిహారం అందించాలి

Dec 12,2023 00:16

ప్రజాశక్తి – రేపల్లె
తూపానుతో నష్టపోయిన బాడే-జన్నే కాలువ పోరంబోకు భూముల సాగుదారులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డీఓ షారోన్‌, తహశీల్దార్ ఆఫీసులు వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. కౌలురైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడారు. తుపాను వల్ల చిన్న రైతులు పూర్తిస్థాయిలో నష్టపోయారని అన్నారు. ప్రతి ఎకరాకు నష్టం పరిహారం చెల్లిస్తామన్న విషయాన్ని గుర్తు చేశారు. మండలంలో గత 80ఏళ్ల నుండి బాడే-జన్నే కాలువ పరిధిలో నల్లురిపాలెం, సిగ్గుపాలెం, బొబ్బర్లంక, విశ్వేశ్వరం గ్రామాల పరిధిలోని 350ఎకరాల భూమిని 300మందిపైగా పేదలు సాగు చేసుకుంటున్నారని అన్నారు. గతంలో వీరికి పన్ను కట్టించుకుని ప్రభుత్వం నుండి అన్ని సబ్సిడీలు, నష్ట పరిహారాలు అందించే వాళ్ళని, గడిచిన మూడేళ్లుగా ఆన్లైన్ కాలేదనే పేరుతో ఎటువంటి నష్టపరిహారాలు ఇవ్వటం లేదని తెలిపారు. వీళ్ళు అనేక కష్టాలు ఎదుర్కొని వాస్తవమైన సాగుదారులుగా ఉండి వ్యవసాయ కార్మికులు, సన్నకారు రైతులు ఎకరానికి రూ.40వేలు పెట్టుబడి పెట్టి తుఫాన్ ప్రభావంతో సర్వం కొల్పయారని తెలిపారు. కానీ వీరికి పట్టాలు లేవనే కారణంతో నష్టపరిహారం ఇవ్వకుండా అనర్హులను చేస్తున్నారని అన్నారు. జిల్లాలో వరి పంట దెబ్బతిన్నదని అధికారులు చెబుతున్నారని, నష్టపోయిన అందరికీ పరిహారం ఇవ్వాలని సిఎం కూడా చెప్పారని అన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి వాస్తవ సాగుదారులైన పేదలుకు నష్టపరిహారం ఇవ్వలని డిమాండ్‌ చేశారు. పట్టాలు లేవనే కారణంతో ఎన్యుమరేషన్‌లో నమోదు చేయడంలేదని చెప్పారు. విఆర్‌ఒ సెల్ప్‌ డిక్లరేషన్‌తో సాగుదారులుగా గుర్తించి పరిహారం ఇవ్వాలని కోరారు. నష్టపరిహారం ఇవ్వకపోతే ఆర్‌బికెల వద్ద బైటాయంచి ఆందోళన చేస్తాని తెలిపారు. ధర్నాలో ఆయా గ్రామాల పరిధిలో కౌలురైతు నాయకులు జి దానియేలు, డి బాబురావు, కె మరిదాసు, జి జైపాలు, యెహోను, జి లక్ష్మయ్య పాల్గొన్నారు.

➡️