ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య

May 22,2024 23:04 ##vetapalem #cpm

ప్రజాశక్తి – వేటపాలెం
నేతి తరం, భావిత తరాలకు ఆదర్శనేత కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్యని సిపిఎం కార్యదర్శి నలతోటి బాబురావు అన్నారు. మండలంలోని సమైక్యనగర్‌లో సిపిఎం నాయకులు మచ్చ అయ్యప్పరెడ్డి ఇంటి వద్ద సుందరయ్య 39వ వర్ధంతి సభ బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా సుందరయ్య చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. బాబురావు మాట్లాడుతూ విద్యార్థి దశలో స్వతంత్ర పోరాటంలో సుందరయ్య పాల్గొన్నారని అన్నారు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం తన ఇంటి నుండే ప్రారంభించారని అన్నారు. పార్లమెంట్ మొదటి ప్రతిపక్ష నేతగా పేదల బాధలను పార్లమెంటులో వినిపించిన నిబద్ధత కలిగిన నేత సుందరయ్య అని అన్నారు. నైజం నవాబుల సంస్థానాలను కూల్చి విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదంతో పేదల రాజ్యం నిర్మించిన పోరాట యోదులని అన్నారు. తెలంగాణ పోరాటంలో వేలాది ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేశారని అన్నారు. నేడు దేశంలో ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, రాజ్యాంగంపైన జరుగుతున్న దాడులకు నిరసనగా సుందరయ్య స్పూర్తితో పోరాడాలని కోరారు. మత ప్రాతిపదికన ప్రజలపైన బిజెపికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలపైన దాడులు, అరెస్టులకు పాల్పడుతుందని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పోరాటాల్లో ప్రజలు కలిసి రావాలని కోరారు. ముందుగా ప్రజా నాట్య మండలి కార్యకర్తలు పాటల రూపంలో సుందరయ్యకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మచ్చ అయ్యప్పరెడ్డి, వి భగవాన్‌దాస్, నారాయణమ్మ, కె సీమోను పాల్గొన్నారు.

➡️