ప్రశాంతంగా పదవతరగతి పరీక్షలు

Mar 18,2024 23:54

– జిల్లాలో 630మంది గైర్హాజరు
– పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
ప్రజాశక్తి – బాపట్ల
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకు తనిఖీ బృందాలు తమ సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి. పరీక్షకు గంట ముందుగానే విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా డీఈఒ కె నారాయణరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య సిబ్బందిని అత్యవసర ఔషధాలతో సిద్ధంగా ఉంచారు. త్రాగునీటి సౌకర్యం కల్పించారు. పరీక్ష హాల్లో గాలి, వెలుతురు ఉండే ఏర్పాట్లు చేశారు.
630మంది విద్యార్థులు గైర్హాజరు
జిల్లాలో బాపట్ల, రేపల్లె, వేమూరు, చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల పరిధిలో 108పరీక్షా కేంద్రాల్లో తొలిరోజు నిర్వహించిన తెలుగు, సంస్కృతం, ఉర్దూ పరీక్షలకు సంబందించి 17436మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 16806మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈఒ కె నారాయణరావు తెలిపారు.
తనిఖీ బృంధాల విస్తృత పర్యటన
పదవ తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు పరీక్ష ముగిసేవరకు తనిఖీ బృందాలు వెన్నంటి ఉన్నాయి. కలెక్టర్ పి రంజిత్‌బాషా పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. పాఠశాల టెక్స్ బుక్స్ డైరెక్టర్, జిల్లా పరిశీలకులు రవీంధ్రనాద్‌రెడ్డి జిల్లాలోని ఐదు సెంటర్లలో తనిఖీలు చేశారు. డిఇఒ కె నారాయణరావు నాలుగు సెంటర్లలో తనిఖీలు చేశారు. వీరితోపాటు డిప్యూటీ డీఈఒలు ఒక్కొక్కరు నాలుగు పరీక్షా కేంద్రాలు చొప్పున తనిఖీచేశారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమించిన సిట్టింగ్ స్వ్కాడ్, ఫ్లైయింగ్ స్వ్కాడ్ బృందాలు తనిఖీలను ముమ్మరం చేశారు.
పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా
పదవతరగతి పరీక్షలు జరిగే 108పరీక్షా కేంద్రాల వద్ద ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్లు, ప్రింటర్లను అధికారులు ఆదేశాల మేరకు మూసివేశారు. పరీక్ష ప్రారంభమైనప్పటికీ నుంచి ముగిసేవరకు పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు చేశారు.

➡️