ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

Jun 15,2024 00:18 ##Santhamaguluru

ప్రజాశక్తి – సంతమాగులూరు
కులం పేరుతో దూషించి దాడి చేసిన వారిపై నెల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ నేటికీ కేసు నమోదు చేయలేదని బాధితుడు రాపూరి జానకి రామయ్య కెఎన్‌పిఎస్, ప్రజా సంఘాల నాయకులకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మండలంలోని కామేపల్లి ఎస్టీ కాలనికి (యానాదులు) చెందిన రాపూరి జానకి రామయ్య గత కొన్ని నెలలుగా పుట్టావారిపాలెం, కామేపల్లి గ్రామాల మధ్య ఉన్న సిరి వెంచర్‌కు కాపలాదారునిగా పనిచేస్తున్నాడు. గత మే 14న ఎన్నికలు జరిగిన మరుసటి రోజు రాత్రి 9 గంటల సమయంలో కామేపల్లి గ్రామానికి చెందిన జాష్టిరామయ్య, శేషగిరిరావు, వినోద్ అనే ముగ్గురు మందు సేవించి వెంచర్ వద్దకు వెళ్లారు. వెంచర్ స్థలంలో కూర్చుని మందు తాగుతుండగా జానకి రామయ్య వారిని అడ్డుకున్నాడు. వెంచర్ స్థలంలో మందు తాగితే తన యజమాని తనను తిడతాడని జానకి రామయ్య వారిని అక్కడి నుండి వెళ్లాలని కోరాడు. దీంతో రెచ్చిపోయిన జాష్టి రామయ్య, శేషగిరిరావు, వినోద్ తమకే చెబుతావారా అంటూ జానకి రామయ్యను యానాది కులం పేరుతో దూషించి దాడి చేశారు. వారి దాడి నుండి తప్పించుకుని కాలినడకన కామేపల్లిలోని తమ కాలనీకి చేరుకున్నాడు. వెంటనే తన కొడుకుని వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఎస్ఐ పి సురేష్ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ కాలయాపన చేస్తున్నాడని కెఎన్‌పిఎస్‌, ప్రజాసంఘాల నాయకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. రాపూరి జానకి రామయ్యను కులం పేరుతో దూషించి దాడి చేసిన జాష్టిరామయ్య, శేషగిరిరావు, వినోద్‌పై వెంటనే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కెఎన్‌పిఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓ శ్రీనివాసరావు పోలీస్ ఉన్నతాధికారులను కోరారు.

➡️