ప్రోటోకాల్ వివాదంలో సచివాలయం

Feb 8,2024 00:36

ప్రజాశక్తి – పంగులూరు
మండలంలోని చందలూరు గ్రామంలో నిర్మించిన సచివాలయం ప్రారంభం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని హంగులు పూర్తి చేసుకొని ప్రారంభం కోసం గత ఆరు నెలలుగా ఎదురుచూస్తున్న సచివాలయాన్ని ఈనెల 11న ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ తప్పకుండా పాటించాలని, లేకుంటే ప్రారంభాన్ని నిలిపివేయాలని టిడిపి తేల్చి చెప్పడంతో వివాదం మొదలైంది. ఇప్పుడు సచివాలయ ప్రారంభం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మండలంలో చందలూరు గ్రామం టిడిపికి బలమైన గ్రామం. మండలంలోని 21పంచాయతీకు గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చందలూరు ఒక్క గ్రామంలో మాత్రమే టిడిపి గెలిచింది. ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా చందలూరు ఎంపీటీసీ మాత్రమే టిడిపి గెలుచుకుంది. ఈ స్థానాలను గెలుచుకునేందుకు అధికార వైసిపి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. అంతేకాకుండా గ్రామంలో విఓఏ విషయంలో ఇంకా అనేక విషయాలలోనూ టిడిపి, వైసిపి మధ్య వైరుద్యాలు పెరిగాయి. చివరకు పోలీసు కేసులు కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది. గ్రామంలో రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అనే పరిస్థితిలో ఉన్నాయి. అధికారులు కూడా అధికార వైసిపివైపే ఎక్కువగా మొగ్గు చూపడంతో ప్రతిపక్ష టిడిపి నాయకులు ఏమైనా అధికార వైసిపిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితమే నిర్మాణం పూర్తయ్యి ప్రారంభించాల్సిన సచివాలయం గ్రామంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ పనులు, వాటర్ పనులు పూర్తికాలేదనే నెపంతో ఇప్పటివరకు ప్రారంభాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు వైసిపికి చెందిన కొత్త ఇన్చార్జి రావటం, ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగాల్సి ఉండగా ప్రభుత్వం కార్యాలయాలకు నిర్మాణాలు పూర్తయినా, కాకపోయినా ప్రారంభం పెట్టాలని నిర్ణయించింది. దీంతో ఈనెల 11న సచివాలయాన్ని ప్రారంభించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ కొత్త ఇన్చార్జి పానెం చిన హనినిరెడ్డి చేత ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. అయితే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ టిడిపికి చెందిన వారు కావడంతో ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించాలని, ప్రోటోకాల్ పాటించకపోతే ప్రారంభోత్సవం ఆపుకోమని టిడిపి నాయకులు ఖరాఖండిగా చెబుతున్నారు. ప్రోటోకాల్ పాటించకపోతే ప్రివిలేజ్ కమిటీలో విషయాన్ని ప్రస్తావిస్తామని, ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ కూడా అన్నట్లు తెలిసింది. ప్రోటాకాల్ విషయాన్ని ప్రివిలేజ్ కమిటీలో ప్రస్తావిస్తే అందుకు బాధ్యులైన అధికారులకు కఠిన చర్యలు తప్పవని భావిస్తున్నారు. దీంతో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు అధికారుల పరిస్థితి ఏర్పడింది. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి నియోజకవర్గంలో వైసీపీకి ఎంఎల్‌ఎ లేకపోయినప్పటికీ అన్ని కార్యక్రమాలు అధికార పార్టీ చేసుకుంటూ పోయింది. గెలిచిన ఎమ్మెల్యేని పరిగణలోకి తీసుకోకుండా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పుడు చందలూరులో అదే విధంగా ప్రోటోకాల్ పాటించకుండా ప్రారంభం చేస్తే చూస్తూ ఊరుకోమని టిడిపి నాయకులు చెబుతున్నారు. సచివాలయం ప్రారంభం చుట్టూ ప్రొటోకాల్‌ రాజకీయ వివాదాలు చుట్టుముట్టడంతో 11న ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

➡️