రాష్ట్రాభివృద్ది కాంగ్రెస్‌ ఆశయం

Dec 29,2023 23:30

ప్రజాశక్తి – రేపల్లె
రాష్ట్ర అభివృద్ధి కాగ్రెస్ ఆశయమని మాజీ కేంధ్ర మంత్రి జెడీ శీలం అన్నారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ప్రధాన మంత్రులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు, ఎన్టీఆర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణంలో నిరవధిక దీక్షలు చేస్తున్న లాయర్లకు, అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలు 10ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఎదిరించలేక ప్రాంతీయ పార్టీల నాయకులు తలలు వంచి మోదీ జపం చేశారని విమర్శించారు. ఆంధ్రులకు అన్యాయం జరగకూడదని ఆనాడు సోనియాగాంధీ వివిధ అంశాలతో చట్టం రూపొందించారని చెప్పారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తామని, ప్రత్యేక హోదా సాధిస్తామని అధికారం చేపట్టిన ప్రాతీయ పార్టీల నాయకులు కేంద్రం వద్ద మెడలు వంచారని ఆరోపించారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి బలోపేతం అవుతుందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఇంచార్జీ కేసన రామకోటేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలు చేస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, విశాఖ ఉక్కును పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆంధ్రలో ప్రజా రంజక పాలన చేస్తామని అన్నారు. రాష్ట్రాభివృద్దికి ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలిపారు.

➡️