విద్యార్థులు పట్టుదలతో చదవాలి

ప్రజాశక్తి – రేపల్లె
విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని డాక్టర్ ఎవి సుబ్బారావు పేర్కొన్నారు. వైష్ణవి నర్సింగ్ హోమ్ డాక్టర్ ఎవి సుబ్బారావు, పేటేరులోని పరుచూరి బలరామయ్య మెమోరియల్ జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో 2023 – 2024 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు నగదు బహుమతి, నోటు పుస్తకాలు బహూకరించారు. దీనిలో మొదటి స్థానం సాధించిన మోర్ల పూజకు రూ.10వేలు, 550పైన మార్కులు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5వేలు, 500-550 మద్య మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.2వేల చొప్పున బహుకరించారు. ఈ సంవత్సరం 2024- 2025 10వ తరగతి చదువుతున్న 140మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పది నోటు పుస్తకాలు అందజేశారు. ఈ సంద్భంగా డాక్టర్ ఎవి సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా లక్ష్యాన్ని ఏర్పర్చుకొని కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకొని సమాజాభివృద్ధికి దోహదపడాలని సూచించారు. గతంలో ఈ ప్రాంతంలో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడేవారని, నేడు ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల్లో అభివృద్ధి సాధించారని అన్నారు. పాఠశాల హెచ్‌ఎం చెరుకూరి బాబూజీ అధ్యక్షత వహించిచారు. కార్యక్రమంలో పట్టణ ఆదర్శ వేదిక నాయకులు యడ్లపల్లి కిషోర్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️