కౌలు రైతులకు సిసిఆర్ కార్డులు ఇవ్వాలి : వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్

Jul 3,2024 00:30 ##Repalle #CPM #Nagaram

ప్రజాశక్తి – రేపల్లె
కౌలు రైతులకు భూ యజమాని సంతకం నిబంధన తొలగించి, గ్రామ సభల ద్వారా సిసిఆర్ కార్డులు ఇవ్వాలని కౌలురైతు, వ్యవసాయకార్మిక సంఘాలు మోటార్ సైకిల్ ర్యాలీ మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు సమస్యలు పరిష్కారం కోసం ఎపి కౌలురైతుల సంఘం, వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కౌలు రైతు యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేపల్లె మండలం ఉల్లుపాలెం, నల్లూరిపాలెం, సింగుపాలెం, విశ్వేశ్వరం, చాట్రగడ్డ, పెనుమూడి, పేటేరు, బేతపూడి గ్రామాల్లో యాత్రా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్ మాట్లాడుతు సిసిఆర్ కార్డు భూ యజమాని సంతకం నిబంధన తొలగించాలని కోరారు. గ్రామ సభల ద్వారా సిసిఆర్ కార్డులు ఇవ్వాలని అన్నారు. కార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకులు రుణాలు ఇవ్వాలని కోరారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలంటే, ఇప్పుడున్న సిసిఆర్సి చట్టాన్ని రద్దుచేసి, 2011 ఎల్ఇసి చట్టాన్ని తిరిగి అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 40లక్షల కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవాలని సంతకాల సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని అన్నారు. నూటికి 70శాతం భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారని అన్నారు. కౌలు వ్యవసాయం లాభదాయకంగా లేకపోయినా, దళిత, వెనుకబడిన తరగతులు, ఇతర కులాల్లోని భూమిలేని పేదలు కౌలుకు సిద్ధమవుతున్నారని అన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, దుక్కి, దమ్ము, ట్రాక్టర్, కోత, పోత మిషన్ కిరాయిలు విపరీతంగా పెరిగిందని అన్నారు. అధిక, అకాల వర్షాలు, తుఫానులు నోటికి వచ్చిన వంటను పాడు చేస్తున్నాయని అన్నారు. మరోవైపు పంట కాలువలు బాగు చేయించడంలేదని అన్నారు. కౌలు వ్యవసాయం గిట్టుబాటు కాక, పెట్టుబడికి ప్రభుత్వ బ్యాంకుల్లో అప్పులు రాక, అప్పులు పాలై కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. సొంత రైతులే గిట్టుబాటు కాక వ్యవసాయాన్ని వదిలి వేస్తుంటే కౌలు రైతులే ప్రజలందరికీ ఆహారాన్ని అందించే బాధ్యత తమ భుజాల నెత్తుకుంటున్నారని అన్నారు. రైతాంగం అనేక పోరాటాలు చేసి 2011లో ఎల్ఈసి చట్టాన్ని సాధించుకుందని అన్నారు. కానీ 2019లో వచ్చిన వైసిపి ప్రభుత్వం పాత కౌలు చట్టాలను రద్దుచేసి, కార్డుకు యజమాని సంతకం తప్పనిసరి చేసి, కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. దీనితో భూ యజమానులు సంతకం పెట్టటానికి ముందుకు రావడం లేదని అన్నారు. అందువలన కార్డుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అన్నారు. ప్రభుత్వం తమ టార్గెట్ పూర్తి చేసినట్లు ప్రతి ఏటా చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు బి అగస్టీన్, సిహెచ్ మణిలాల్, పి మనోజ్, కె గోపి, వి మావో, కె రమేష్, డి బాబురావు, జి రాహేలు, కెవి లక్ష్మణరావు పాల్గొన్నారు.


నగరం : కౌలు రైతులకు భూ యజమాని సంతకంతో సంబందం లేకుండా సిసిఆర్ కార్డులు ఇవ్వాలని కోరుతూ కౌలు రైతు, వ్యవసాయకార్మిక సంఘాల నాయకులు మంగళవారం సంతకాలు సేకరించారు. మండలంంలోని సజ్జవారిపాలెం, బోరమాదిగపల్లె, చిలకలవారిపాలెం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులతో సంతకాలు సేకరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి ఆగస్టిన్ మాట్లాడుతు సిసిఆర్ కార్డు భూ యజమాని సంతకం నిబంధన తొలగించాలని కోరారు. గ్రామ సభల ద్వారా సిసిఆర్ కార్డులు ఇవ్వాలని కోరారు. కార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకులు రుణాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్, సిహెచ్ మణిలాల్, కె రమేష్, కెవి లక్ష్మణరావు, జి మరియదాసు, బంగరాయ్య పాల్గొన్నారు.

➡️