సూర్యలంక తీరంలో కార్తీక మాస శోభ

Nov 27,2023 23:26

ప్రకాశక్తి – బాపట్ల రూరల్‌
కార్తీక సోమవారం, పౌర్షమి సందర్భంగా సూర్యలంక సముద్రతీరం పర్యాటకులతో కార్తీక మాసం శోభను సంతరించుకుంది. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చారు. ప్రతి ఏడాది లాగే భక్తుల సంఖ్య పెరిగింది. సూర్యోదయానికి ముందే ఎంఎల్‌ఎ కోనా రఘుపతి దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి సముద్రుడికి కార్తీక దీపం హారతి అందించారు. టిడిపి ఇంచార్జ్ వేగేసిన వర్మ ఆధ్వర్యంలో 50వేల మందికి అల్పాహారం ఏర్పాటు చేశారు. కర్లపాలెం మండల టిడిపి నాయకులు మాడా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. తెల్లవారుజాము నుంచే పోలీసులు ప్రధాన కూడలి ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. సూర్యలంక దారి పొడవున ఎక్కడికి అక్కడ మార్గాన్ని చూపే బోర్డులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేశారు. వాహనాలు పార్కింగ్ చేయడం కోసం ప్రత్యేకంగా స్థలాన్ని సిద్దం చేశారు. సముద్ర స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో మొక్కలు తీర్చుకున్నారు. పొంగళ్ళు వడ్డించారు. యువత స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. గుర్రపు స్వారీ, నాలుగు చక్రాల మోటారు బైకులు ఎక్కి పర్యాటకులు సందడి చేశారు. అడవి పంచాయతీ కార్యదర్శి జిఆర్‌డి ప్రసాద్ తన సిబ్బందితో ఏర్పాట్లు చేశారు. రూరల్ సిఐ వేణుగోపాలరెడ్డి భద్రతను పర్యవేక్షించారు. దశాబ్దాలుగా కార్తీక మాసం సందర్భంగా వస్తున్న సంస్కృతి, ఆచారాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మెరైన్ సీఐ సుబ్బారావు అధ్వర్యంలో తీర ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. సుమారు 60వేల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

➡️