కాంగ్రెస్‌తోనే దేశభవిష్యత్తు : మాజీ కేంద్రమంత్రి జెడి శీలం

Mar 11,2024 00:02

ప్రజాశక్తి – భట్టిప్రోలు
దేశంలో బిజెపి పాలనలో అరాచకాలు, ఆకృత్యాలు పెరిగిపోయాయని మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం ఆరోపించారు. ముస్లింలు, మహిళలపై దాడులు, ఊస కోతలు కొనసాగుతూనే ఉన్నాయని ఆదేన వ్యక్తం చేశారు. మండలంలోని అద్దేపల్లి ముస్లిం షాదీ ఖానాలో వేమూరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమీక్ష సమావేశం ఆదివారం నిర్వహించారు. కాంగ్రెస్‌ ఇన్‌చార్జి తాడికొండ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. సభలో జెడి శీలం మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ పాలనలో మతోన్మాదం పెచ్చరిల్లిందని అన్నారు. బిజెపి అరాచకాలకు పాల్పడుతూ అభివృద్ధి నిరోధక శక్తిగా మారారని అన్నారు. దేశ భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్‌లోనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎలాంటి కొత్త కంపెనీలు, ఫ్యాక్టరీలు తీసుక రాకపోగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను బడా బాబులకు తాకట్టు పెట్టుకునేందుకు మోడీ పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ బాటలోనే రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన కలిసి పోయాయని ఆరోపించారు. వీరంతా రాష్ట్ర అభివృద్ధికి కాకుండా వారి వ్యక్తిగత లాభాల కోసం, వారిపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడానికి బిజెపితో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పాలనలో ఇక్కడ రాజధాని లేకుండా పోయిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యమైందని అన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు కేంద్రం మెడలు వంచుతారనని అన్న జగన్మోహన్ రెడ్డి నేడు ప్రత్యేక హోదా విస్మరించారని అన్నారు. ప్రజలను అవమానించారని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో మరో బిజెపి, టిడిపి, వైసిపి గెలిస్తే దేశంతోపాటు రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలవుతుందని అన్నారు. మతోన్మాదంతో పెట్రేగిపోతున్న బిజెపిని, దానికి వత్తాసు పలుకుతున్న వైసిపి, టిడిపి, జనసేనలను ప్రజలంతా ఓడించి దేశ రాష్ట్ర భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని కోరారు.
ఈనెల 11నుండి 15వరకు ఇంటింటి సర్వే
కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని ప్రధాన రెండు అంశాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ నెల 11నుండి 15వరకు ఇంటింటికి తిరిగి సర్వే చేపట్టాలని జెడి శీలం సూచించారు. పేదరికంతో మగ్గుతున్న పేద ప్రజలకు ప్రస్తుతం పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో ఆర్థిక భారాన్ని మోపుతుందని అన్నారు. నిరుపేద కుటుంబాలకు నెలకు రూ.5వేల చొప్పున మహిళలకు అందించేందుకు రాహుల్ గాంధీ ఇందిరా అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో అనేకమంది నిరుద్యోగుల స్థితిగతులను వివరించిన దృష్ట్యా చదువు పూర్తి చేసుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి పెద్దపెద్ద కంపెనీల్లో ఏడాది పాటు అప్రెంటిస్షిప్ నిర్వహించుకునే విధంగా అందుకు అయ్యే ఖర్చు ప్రభుత్వ భరించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మేనిఫెస్టోలో సిద్ధం చేశారని తెలిపారు. ఈ పథకం కూడా నిరుపేద యువతకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌ను ఆదరించి గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బోరగ సుబ్బారావు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు పోతార్లంక ఏడుకొండలు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గౌస్ బెగ్, తాడిపర్తి ప్రసాదు పాల్గొన్నారు.

➡️