ఐసిడిఎస్ కార్యాలయంలో సమస్యల తీష్ట

Mar 4,2024 00:14

ప్రజాశక్తి – వేమూరు
అమర్తలూరులోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమస్యలు తీష్ట వేశాయి. ప్రభుత్వం సొంత భవనంగా ఉన్న కార్యాలయానికి వెళ్లేందుకు సరైన రహదారి మార్గం లేదు. రేపల్లె ప్రాజెక్టు కింద పనిచేసిన అంగన్‌వాడీ కేంద్రాలు బాపట్ల జిల్లా ఏర్పాటుతో అమర్తలూరు ప్రాజెక్టు కిందకు వచ్చాయి. దీంతో నియోజకవర్గంలోని చుండూరు, అమృతలూరు, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని సుమారు 300కు పైగా అంగన్వాడీ కేంద్రాలకు ఈ ప్రాజెక్టు కార్యాలయం పనిచేస్తుంది. అంగన్వాడీ కార్యకర్తలకు ప్రతినెల ప్రాజెక్టు, సెక్టార్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే నూతన విధానాలు, కొత్త యాప్‌లు, ప్రభుత్వ అమలు చేస్తున్న పౌష్టికాహార వినియోగ రికార్డులు, దానికి అనుబంధంగా ఉన్న వివిధ రకాల రికార్డులపై కార్యకర్తలకు సూపర్వైజర్లు, సిడిపిఓ ద్వారా అవగాహన కల్పిస్తూ ఉంటారు. అంశాలను కార్యకర్తలు అవగతం చేసుకొని వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో అమృతలూరు ఐసిడిఎస్ కార్యాలయం అణువుగా లేకపోవడంతో కార్యకర్తల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కార్యాలయ భవనంలో కొంత భాగం పౌష్టికాహార సరుకులు నిల్వకు గోదాము ఏర్పాటు చేయగా మరికొంత భాగంలో సిడిపిఓ కార్యాలయ గది, రికార్డ్ అసిస్టెంట్ గది, సూపర్వైజర్లు విధులు నిర్వహించుకునేందుకు ఒక హాలు మాత్రమే ఉన్నాయి. అంగన్‌వాడీలకు ప్రతినెల ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్టు సమావేశాలు జరుపుకునేందుకు ఎలాంటి సమావేశ మందిరం లేకపోవడంతో ఎన్నో ఏళ్లుగా సమావేశాలు జరిగే పరిస్థితి లేదు. దీంతో అధికారులు సమాచారం ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు. సమావేశాలు జరిపి అవగాహన కల్పించే పరిస్థితి లేకపోవడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.
బిక్కుబిక్కుమంటూ వెళ్లాలి
అమర్తులూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంకు వెళ్లడానికి ప్రధాన రహదారి నుండి 100మీటర్లపైగా దూరం ఉంటుంది. ఈ మార్గంలో ఇరువైపుల పురాతన గృహాలు శిధిలమై పిచ్చి కంప పెరిగి రాకపోకలకు మహిళలు భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. రహదారిలో వెళ్లేటప్పుడు ఎటు నుంచి ఎలాంటి పాములు, జెరులు అడ్డువస్తాయోనని ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఏదో విధంగా కార్యాలయానికి చేరుకున్నప్పటికీ ఆయా పనులపై వచ్చే కార్యకర్తలు కనీసం వేచి ఉండటానికి అవకాశం లేదు. కొందరు అక్కడున్న మెట్లపైన, బయట అరుగుల మీద కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. సిడిపిఒలు, సూపర్వైజర్లు, కార్యాలయ సిబ్బంది, ఆయా ప్రాంతాల నుండి వచ్చే అంగన్‌వాడీ కార్యకర్తలు తిరిగే రహదారి మార్గాన్ని అటు పంచాయతీ అధికారులు గానీ, మండల అధికారులు కనీస రహదారిని ఏర్పాటు చేయకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లా పునర్విభజనతో నియోజకవర్గానికి కేటాయించబడిన అమృతలూరు ప్రాజెక్టు కార్యాలయంలో తిష్ట వేసిన సమస్యలను ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పరిష్కరించి కార్యాలయంపై సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేసి, రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతున్నారు.

➡️