ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత

Feb 24,2024 23:27

ప్రజాశక్తి – బట్టిప్రోలు
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి బాధ్యతని, దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దారు సిహెచ్ పద్మావతి సూచించారు. స్థానిక టీఎం రావు ఉన్నత పాఠశాల విద్యార్థులచే పాఠశాల నుండి బస్టాండ్ సెంటర్ వరకు స్విప్పు అవగాహన ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో కొద్దిసేపు మానవహారం నిర్వహించారు. విద్యార్థులచే ఎన్నికల ట్రైనర్ గుర్రం మురళీమోహన్ నినాదాలు చేశారు. తహశీల్దారు పద్మావతి మాట్లాడుతూ 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలని కోరారు. తద్వారా ప్రజలకు ఉపయోగపడే ప్రజా సేవ చేసే నిజాయితీ పరుడైన నాయకుడిని ఎన్నుకోనేందుకు దోహదపడుతుందని అన్నారు. ఓటు హక్కు ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటిదని అన్నారు. బుల్లెట్ కంటే బలమైనది బ్యాలెట్ అని అన్నారు. ర్యాలీ అనంతరం భట్టిప్రోలు పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవీఎం బాక్సుల పనితీరు నమూనాలను మురళీమోహన్ గ్రామస్తులకు వివరించారు. వెల్లటూరు జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులచే ఇటీవల రూపొందించిన ఈవిఎం మిషన్, బ్యాలెట్ బాక్స్ దాని పని తీరు, ఓటు హక్కు వినియోగించుకునే విధానాన్ని క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సిహెచ్ రామ కోటేశ్వరరావు, ఎంఇఒ నీలం దేవరాజ్, ఎస్‌ఐ శ్రీనివాసరావు, డిటి శ్రీనివాస్, వీఆర్‌ఒలు శివరామకృష్ణ, అంబటి ప్రసాద్, రత్నాకర్, వెంకటేశ్వరరావు, కంప్యూటర్ ఆపరేటర్ రాజేష్, పంచాయతీ కార్యదర్శి కోట శ్రీనివాసరావు, ఎఎంసి డైరెక్టర్ కౌతరపు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️