తీరనున్న స్మశాన దారి సమస్య

Feb 11,2024 23:01

ప్రజాశక్తి -కారంచేడు
మండలంలోని దగ్గుబాడు పంచాయతీ అంబేద్కర్ నగర్, అరుంధతి నగర్ కాలనీ వాసులకు దశాబ్ద కాలంగా ఉన్న స్మశాన దారిసమస్య తీరనుంది. ఇటీవల కాలంలో సర్పంచి గేర రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో స్మశాన దారి సమస్య తీరడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కాలనీలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి స్మశానానికి రహదారి లేకపోవడంతో పొలాల గట్ల మధ్య నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. వర్షాకాలంలో అయితే వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. గట్ల మీద పొలాల్లో నీరు నిలిచి ఉన్నప్పుడు మృతుని అంతక్రియలు నిర్వహించడానికి నరకయాతనపడే పరిస్థితి ఉండేది. తాజాగా సర్పంచి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో దళితుల స్మశానానికి రహదారి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేశారు. రహదారి కోసం సుమారు రూ.3లక్షలు వెచ్చించి దారికి అవసరమైన పొలాన్ని కొనుగోలు చేశారు. రహదారి కోసం పనులు మొదలు పెట్టారు. రహదారికి అడ్డుగా ఉన్న పంట కాలవపై కల్వర్టు ఏర్పాటు చేసి అనంతరం స్మశాన వాటికకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.12లక్షలు నిధులు పంచాయతీ నుండి కొంత, 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి కొంత ఏర్పాటు చేశారు. వారితోపాటు స్మశానానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కోసం అంబేద్కర్ నగర్, అరుంధతి నగర్ కాలనీ వాసుల నుండి కొంత విరాళాలు కూడా సేకరించి ఏర్పాట్లు చేసినట్లుగా సర్పంచి చెప్పారు. కొద్ది రోజుల్లో దళితుల స్మశానానికి రహదారి ఏర్పాటు కానుండటం పట్ల స్థానికులు హర్షణ వ్యక్తం చేశారు.

➡️