ధరలేక పొగాకు రైతు దిగాలు

May 23,2024 22:58 ##Parchuru #Tobacco

ప్రజాశక్తి – పర్చూరు
ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరొకవైపు వాతావరణ అననుకూల పరిస్థితులు. ఇదికాక పంటకు అధిక పెట్టుబడులు వెరసి రైతులను మనోవేదనకు గురి చేస్తున్నాయి. రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగు చేసుకున్న రైతులకు సరైన మద్దతు ధర లేకపోవడంతో నష్టాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులలో ఏమి చేయాలో దిక్కుతోచక అయోమయంలో అన్నదాతలు ఉన్నారు. పర్చూరు వ్యవసాయ సబ్ డివిజన్లో 23,989 ఎకరాల్లో వైట్ బర్లీ పొగాకు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. లో గ్రేట్ పొగాకు క్వింటాలు రూ.14వేలకు పైచిలుకు పలకడంతో సాగు చేసుకున్న రైతులకు ఎంతో ఊరట నిచ్చింది. ఈ నేపథ్యంలో నాణ్యమైన బర్లీ పొగాకు పువ్వు మంచి ధర పలుకుతుందని ఆశపడ్డారు. ఆశ కాస్త అడి ఆశగా మారింది. లో గ్రేడ్ ధరకు మించి నాణ్యమైన పొగాకు కొనుగోలు జరగటం లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు ఊగిసలాడుతున్నారు. ఎన్నికల వల్ల కొనుగోలు చేసేవారు ముందుకు రావడం లేదని రైతుల అనుకున్నారు. ఎన్నికలు ముగిసిన ధరలు పెరుగుదలలో మార్పు లేకపోవడం, కొనుగోళ్లు మందకోడిగా సాగడంతో రైతుల్లో తీవ్ర నైరాస్యం నెలకొంది. మరో ప్రక్క వర్షాలు పడుతుండటంతో చేతికి అంది వచ్చిన పంట దెబ్బతింటుందని రైతులు మనోవేదనకు గురౌవుతున్నారు. బహిరంగ మార్కెట్లో బర్లీ పుగాకుకు ధర ఉన్న వ్యాపారులు సిండికేట్‌గా మారడం వల్లే ధరలు దిగజారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రక్క ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండడంతో పెట్టుబడుల కోసం అమ్మకాలు చేయవలసి వస్తుందని రైతులు అంటున్నారు. గత సంవత్సరం నాణ్యమైన పొగాకు క్వింటా రూ.18వేలకు కొనుగోలు చేశారు. దీంతో ఈ ఏడాది కూడా అనుకున్న మేర ధర ఉంటుందన్న ఆశతో రైతులు వ్యయ ప్రయాసలకు ఓర్చి వేల ఎకరాల్లో వైట్ బర్లి పొగాకు సాగు చేశారు. ప్రస్తుతం ఉన్న ధరలతో రైతుల్లో తీవ్ర వైరాగ్యం నెలకొంది. ప్రస్తుతం వ్యవసాయ ఖర్చులు, దానికి తోడు నామమాత్రపు దిగుబడులు, కనీస మద్దతు ధర ఉంటేనే పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉందని తలలు పట్టుకుంటున్నారు.

➡️