జల కాలుష్యాన్ని నివారించే తాబేళ్లను రక్షించుకోవాలి

Jun 16,2024 23:34 ##Bapatla #Costel #Tortaies

ప్రజాశక్తి – బాపట్ల
జల కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణకు సముద్రపు తాబేళ్ళు ఎంతగానో దోహద పడతాయని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి పిసి సాయి బాబు అన్నారు. తాబేళ్లపై ప్రజల్లో అవగాహన కలిగించిన పర్యావరణవేత్త ఆర్చికార్ జన్మదినం సందర్భంగా జూన్ 16న ప్రతి ఏటా నిర్వహించే సముద్ర తాబేళ్ల దినోత్సవం సందర్భంగా తాబేళ్ళ పరిరక్షణపై ఆయన విలేకరులతో మాట్లాడారు. సముద్రాల్లో ఆహార వలయాన్ని, ఆవరణ వ్యవస్థ స్థిరత్వాన్ని తాబేళ్ళు కాపాడతాయని అన్నారు. సముద్రం నుండి భూమికి అనేక పోషకాలను చేరవేస్తాయని తెలిపారు. సముద్ర గడ్డి ఎదుగుదలను నియంత్రిస్తాయని తెలిపారు. జెల్లీ చేపలను ఆహారంగా తీసుకొని వాటి సంతతిని తగ్గిస్తాయని అన్నారు. ఇలా తాబేళ్లు సముద్ర జీవులకు ఎంతో ఉపకారం చేస్తాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ఇంతగా ఉపయోగపడే తాబేళ్లను చేజేతులా నాశనం చేస్తున్నారని అన్నారు. సముద్ర జలాల్లో ప్లాస్టిక్ కాలుష్యం, మర పడవల వల్ల తాబేళ్ళు అంతరిస్తున్నాయని పేర్కొన్నారు. భూతాపం వల్ల తాబేలు గుడ్లు నాశనమవుతున్నాయని అన్నారు. రిడ్లే తాబేళ్ల జాతిని సంరక్షించేందుకు గతంలో అటవీ శాఖ అధికారులు సూర్యలంక తీరంలో తాబేలు గుడ్ల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. సముద్ర తీరంలో ఇసుక ఉన్న ప్రాంతాల్లో ఈ సముద్రపు తాబేళ్ళు రాత్రి వేళల్లో ఒడ్డుకు వచ్చి రెండు అడుగుల లోతు గుంట తీసి అందులో 80 నుండి 100 వరకు గుడ్లు పెట్టి తిరిగి అవి పొదిగి పిల్లలుగా బయటకు వచ్చే విధంగా అవసరమైన మేర ఇసుకను కప్పి తిరిగి సముద్రంలోకి వెళతాయని తెలిపారు. అటవీ అధికారులు తీరంలో సంచరించి తాబేలు పాదాల గుర్తులను గుర్తించి గుడ్లు పెట్టిన ప్రదేశాల్లో తాబేలు గుడ్లను సేకరించి తాబేలు సంరక్షణ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక గుంటల్లో గుడ్లను 40రోజులపాటు పొదిగించి తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలే ఏర్పాటు చేశారని తెలిపారు. రాను రాను అటవీ శాఖ అధికారులు తాబేలు సంరక్షణ కేంద్రాల నిర్వహణను వదిలేసారని ఆరోపించారు. అనంతరం కొంతకాలం పాటు సూర్యలంకలో శివాలయం నిర్మాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న దశరథ మహారాజు తాబేలు సంరక్షణ కేంద్రాలను పరిరక్షించారని తెలిపారు. తాబేలు పెట్టిన గుడ్లను తీరంలో సంచరించే ప్రజలు నాశనం చేయడంతో తాబేలు గుడ్ల సేకరణను వదిలేశారని అన్నారు. అంతరించిపోతున్న సముద్రపు తాబేళ్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.

➡️