కృత్రిమ లేగ దూడల అభివృద్ధిపై అవగాహన

Feb 8,2024 23:18

ప్రజాశక్తి – రేపల్లె
పశువుల కృత్రిమ గర్భధారణపై పశుపోషకులు అవగాహన కలిగి ఉండాలని పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ హనుమంతరావు అన్నారు. మండలంలోని పేటేరు గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసి జాతీయ కృత్రిమ గర్భధారణ, లేగ దూడల ప్రదర్శనలో ఆయన మాట్లాడుతూ అంతరించి పోతున్న పశుసంపదను పరిరక్షించేందుకు ప్రభుత్వం వివిధ రకాల చర్యలు చేపట్టిందని చెప్పారు. కృత్రిమ గర్భం ద్వారా పుట్టిన లేగ దూడలను ప్రోత్సహించటానికి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ ద్వారా నూటికి తొంబై శాతం ఆడ దూడలు పుట్టే అవకాశం ఉందని అన్నారు. జాతీయ ఉచిత కృత్రిమ గర్భధారణ 4వ విడత జరుగుతున్న నేపద్యంలో ఏప్రిల్ నుండి జులై 31వరకు పశువులకు కృత్రిమ గర్భధారణ ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. పశు జాతిని సక్రమంగా అభివృద్ది చేసేందుకు సీమన్ ఇంజక్షన్ రెండు దఫాలుగా ఇవ్వటం ఒక పద్ధతి అన్నారు. ఆవుల్లో ఒంగోలు జాతి, గిరి జాతి, పుంగనూరు జాతి పిండాలు ప్రవేశ పెట్టటం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా పశు జాతిని త్వరితి గతిన అభివృద్ధి చెయ్యటం సాద్యం అవుతుందని అన్నారు. వీటితోపాటు పశు పోషకులు, రైతులకు ప్రభుత్వ పథకాల ద్వారా గొర్రెలు, మేకలు, కోళ్లు పెంపకానికి సబ్సిడిపై రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. అంతరించి పోతున్న దేశీయ గో జాతిని సంరక్షించేందుకు జిల్లాలోని అద్దంకి, రేపల్లె మండలాల్లో రూ.30లక్షలతో రెండు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో రూ.15లక్షల సబ్సిడీ ఉంటుందని అన్నారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడు తన వాటా క్రింద రూ.6లక్షలు చెల్లించాలని తెలిపారు. ఈ పథకం కింద 20ఆవులు, ఒక కోడె దూడను ఇస్తారని చెప్పారు. కార్యక్రమంలో పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ నరేంద్ర, పశువైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ కనపర్తి రవికిరణ్ పాల్గొన్నారు.

➡️