నిరుపయోగంగా క్రీడా ప్రాంగణం

May 25,2024 00:29 ##parchuru

ప్రజాశక్తి – పర్చూరు
గ్రామీణ క్రీడాకారులకు శిక్షణనిచ్చి జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్ క్రీడా వికాసం పేరుతో రూ.2కోట్ల నిధులతో క్రీడా ప్రాంగణం నిర్మించారు. ఏళ్ల తరబడి ఎలాంటి ఆలనా పాలనకు నోచుకోక నిరుపయోగంగా మారింది. భవనం చుట్టూ చిల్ల చెట్లు, ముళ్ళపదలు అలముకున్నాయి. ఇటీవల ఎన్నికల సందర్భంగా అధికారులు వెనువెంటనే క్రీడా ప్రాంగణాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణ సమావేశాలు ఈ భవనంలో నిర్వహించారు. దీనివల్ల క్రీడా ప్రాంగణం అధికారులతో కళకళలాడింది. ఎన్నికలు ముగిసిన అనంతరం యథా రాజా తథా ప్రజా అన్న చందంగా మొదటికి వచ్చింది. ప్రస్తుతం పశువులతో ప్రాంగణం దర్శనమిస్తుంది. ప్రాంగణంలో పశువులను తోలటంపై క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి రూ.కోట్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని ఉపయోగంలోకి తీసుకుని వచ్చి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️