పోరాడి సాధించుకున్నాం

Feb 1,2024 22:57

ప్రజాశక్తి – చీరాల
స్థానిక అంబేద్కర్ భవన్‌లో అంగన్‌వాడి కార్యకర్తల విజయోత్సవ సభ గురువారం నిర్వహించారు. సభలో అంగన్‌వాడి కార్యకర్తలు కేక్‌ కట్ చేసి ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎలిజిబెత్ రేఖ మాట్లాడుతూ అంగన్‌వాడి కార్యకర్తలు చేసిన పోరాటం ఇతర కార్మికులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. డిసెంబర్ 12న ప్రారంభించిన ఉద్యమంలో అంగన్‌వాడి కార్యకర్తలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు. సమ్మె జరగకుండా ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసిందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పోలీసులు, సచివాలయ సిబ్బంది చేత అంగన్‌వాడి కార్యకర్తలను ప్రభుత్వం నానా ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. అయితే ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొనే లాగా వామపక్ష పార్టీలు, ప్రజల పూర్తి మద్దతుతో పోరాటాన్ని తీవ్రతరం చేశామని అన్నారు. ప్రభుత్వానికి ఎదురెళ్లి హామీలను నెరవేర్చే విధంగా ప్రభుత్వానికి కళ్ళు తెరిపించామన్నారు. అంగన్‌వాడిలతో పెట్టుకుంటే ఏం జరుగుతుందోనని 42రోజులపాటు జరిగిన ఉద్యమం చూపిందని అన్నారు. భవిష్యత్తులో కూడా కార్యకర్తలు అందరూ కలిసి హక్కుల సాధనకై పోరాడుతామని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు ఎన్‌ బాబురావు, కార్యదర్శి ఎం వసంతరావు, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్‌ జానీ భాష, అంగన్‌వాడి యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️