మండల పాలకవర్గ అధ్యక్షుల పదవి కొనసాగింపు సాగేనా?

Jun 15,2024 00:04 ##Battiprolu #MPP #ZPTC

ప్రజాశక్తి – భట్టిప్రోలు
ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశంకు ఘనవిజయం లభించింది. అప్పటివరకు వైసీపీలో ప్రధాన నాయకులుగా, పాలకవర్గ అధ్యక్షులుగా పనిచేసిన ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం ఎటువైపు వెళ్ళాలనే మీ మాంసలో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా వరికూటి అశోక్ బాబుకు అన్ని విధాల అండగా ఎంపిపి, జెడ్‌పిటిసి దూసుకుపోయారు. మరోసారి వైసిపి ప్రభుత్వం అధికారం చేపడుతుందనే దృక్పథంతో వీరు ప్రచారంలో నిమగ్నమై పని చేశారు. కానీ వారి ఊహలకు వ్యతిరేకంగా ఫలితాలు లభించడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వంలోని ముఖ్యమైన నాయకులు మండల పరిషత్తులో ఇప్పటివరకు జరిగిన వివిధ పనులకు సంబంధించి నిధులు కేటాయింపులు, వాటి వినియోగం వంటి అంశాలపై సమాచార హక్కు ద్వారా సేకరించి దగ్గరించుకున్నారు. పార్టీ మారితే దీనిపై ఉన్నతాధికారుల ద్వారా విచారణ జరిపించి అవినీతి జరిగినట్లుగా తేలితే తగిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైనట్లు తెలిసింది. కాగా ఎంపీపీ, జడ్పిటిసిలో పదవీకాలం మరో రెండేళ్ల నాలుగు నెలల పాటు ఉండటంతో తెలుగుదేశంలో కలిసి ఉండకపోతే అన్ని విధాలు నష్టపోతామనే భావనతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జడ్పిటిసి మారినట్లు ప్రచారం
వైసీపీలో జెడ్పిటిసిగా గెలుపొందిన వ్యక్తి తెలుగుదేశం అధికారం చేపట్టడంతో టిడిపిలో చేరుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. ఉమ్మడి గుంటూరు జెడ్‌పి చైర్మన్ ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టిడిపిలో చంద్రబాబు సమక్షంలో చేరారు. టిడిపి గెలుపు పొందడంతో చైర్మన్ తమ పదవిని కొనసాగించుకుంటున్నారు. దీంతో చైర్మన్ ద్వారా జడ్పిటిసి టిడిపిలో కొనసాగించేందుకు ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. జడ్పిటిసి బాటలోనే ఎంపీపీ కూడా టిడిపిలో చేరే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటే మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులను చేపట్టలేననే భావనలో ఉన్నట్లు ప్రచారం ఉంది. ఇప్పటికే గడిచిన రెండున్నరేళ్ల కాలంలో ఎంపీపీగా సాధించిందేమీ లేకపోగా ఎలాంటి ఆదాయం లేకుండా పదవికే పరిమితం అయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని దృష్ట్యా అన్ని విధానాలు నష్టపోయినట్లుగా ఎంపీపీ అక్కడక్కడ నాయకుల వద్ద వాపోతున్నారు. ఉన్న రెండేళ్ల పదవి కాలమైనా అధికార టిడిపిలో ఉంటే ఎలాంటి సమస్య ఉండదని, ప్రొటోకాల్ కూడా లభిస్తుందని ఆలోచిస్తున్నట్లు నాయకులు చెబుతున్నారు. దీని దృష్ట్యా దగ్గరి పరిచయం ఉన్న తెలుగుదేశం నాయకుల ద్వారా టిడిపిలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది.
భట్టిప్రోలు సర్పంచ్ కూడా ఇదే బాటలో
మండల కేంద్రమైన భట్టిప్రోలు మేజర్ పంచాయతీ సర్పంచి కూడా వైసీపీలో గెలుపొంది జగన్మోహన్‌రెడ్డి గెలుపుకు ఇటీవల అహర్నిశలు కృషి చేశారు. కానీ వైసిపి ఓడిపోవడంతో పరిస్థితి తారుమారైంది. పంచాయతీలో గడిచిన మూడు నెలల కాలంలో రూ.2.5కోట్లకుపైగా నిధులు దుర్వినియోగం జరిగిందని తెలుగుదేశం నాయకులు అన్ని ఆధారాలతో ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల విచారణ చేపట్టి పంచాయతీలో జరిగిన అవినీతిపై ఆధారాలు సేకరించారు. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇదే జరిగితే తన పదవికి ముప్పు తప్పదని భావించిన సర్పంచి కూడా తన సన్నిహితుల ద్వారా ఎమ్మెల్యే ఆనందబాబును కలిసి టిడిపిలో చేరే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆనందబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఏదేమైనా మరికొద్ది రోజుల్లో ఎంపీపీ, జడ్పిటిసి, భట్టిప్రోలు సర్పంచులు తెలుగుదేశంలో చేరనున్నట్లు గ్రామంలో చర్చ జరుగుతుంది.

➡️