అధ్వానంగా ఐలవరం, పెద్దవరం రహదారి

ప్రజాశక్తి – భట్టిప్రోలు
రెండు మండలాలు, రెండు గ్రామాలను కలిపే ప్రధాన రహదారి ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. ప్రజలకు నానా అవస్థలు పడుతున్నారు. మండలంలోని ఐలవరం నుండి నగరం మండలం పెద్దవరం గ్రామానికి ఉన్న రహదారిలో నిత్యం రెండు గ్రామాల ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారు. ఈ రహదారి గత పదేళ్లుగా అధ్వాన స్థితికి చేరింది. పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మోపిదేవి వెంకటరమణారావు మంత్రిగా ఉన్న రోజుల్లో అభివృద్ది చేస్తారని ప్రజలు భావించారు. కానీ ఎలాంటి పనులు జరగలేదు. ప్రస్తుతం ఎన్నికైన ఎంఎల్‌ఎ నక్క ఆనందబాబు అయినా రోడ్డు బాగు చేయిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఈ రహదారి మార్గం గుండా రేపల్లె నుండి ధూళిపూడి, పెద్దవరం, ఐలవరం, కనగాల మీదుగా చీరాల, గుంటూరుకు ఆర్టీసీ బస్సులు ప్రయాణించిన సంఘటనలు ఉన్నాయి. రెండు గ్రామాల మద్య నిత్యవసరాల కోసం ప్రయాణాలు చేస్తుంటారు. ఎండైనా, వానైనా ఈ రహదారి మార్గం ద్వారానే ప్రయాణించాల్సి ఉంటుంది. ఐలవరం నుండి పెద్దవరం వరకు రైతులు, వ్యవసాయ కూలీలు కూడా వెళ్లాల్సి ఉంది. వర్షాకాలంలో రహదారి గుంటల్లో వర్షపు నీరు నిలబడి బురదమయంగా మారి నడవడానికి కూడా వీలులేని విధంగా ఉంటుంది.
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌పై ఆశలు
ప్రస్తుతం తెలుగుదేశం అధికారం చేపట్టి రేపల్లె శాసన సభ్యులు అనగాని సత్యప్రసాద్‌కు రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నగరం మండలం పెద్దవరం ప్రజలు ఈ రహదారి అభివృద్ది కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అద్వానంగా ఉన్న రహదారిపైనే ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు గమనించి రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రిని ప్రజలు కోరుతున్నారు.

➡️