మౌలిక సౌకర్యాలేవి..?

Apr 9,2024 21:00

ప్రజాశక్తి- రేగిడి: ఇల్లు లేని పేదలకు పట్టాలిచ్చి గృహ నిర్మాణాలు చేపట్టి ఊళ్ళనే నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రసంగంలో ఆర్పాటమే తప్ప ఆచరణ లేదని పలువురు విమర్శిస్తున్నారు. నాలుగున్నరేళ్లు పూర్తయిన నేటి వరకు పూర్తిస్థాయిలో జగనన్న కాలనీలు నిర్మాణాలు చేపట్టకపోవడం, కొన్ని నిర్మాణాలు చేపట్టిన ఆ కాలనీలకు మౌలిక సౌకర్యాలు లేక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత టిడిపి హయాంలో స్థలం ఉన్న వారికే గృహాలు మంజూరు చేసి బిల్లులు అందించేవారు. కొన్నిచోట్ల బిల్లులు చెల్లించక లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. వైసిపి ప్రభుత్వ జగనన్న కాలనీలో నిర్మించినప్పటికీ పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపట్టలేక, చేపట్టిన కాలనీలకు రోడ్లు, తాగునీరు తదితర మౌలిక సౌకర్యాలు లేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారుమండలంలోని 25 సచివాలయాల పరిధిలో 15 గ్రామాలకు సంబంధించి జగనన్న కాలనీలు నాలుగున్నరేళ్లు గడిచినా పూర్తికాక పోవడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పూర్తయిన కాలనీలకు కనీసం మౌలిక సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో 368 లే అవుట్‌లకు సంబంధించి 2,531 లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు అందజేశారు. పట్టాలు ఇచ్చినప్పటికీ కొన్ని గ్రామాలలో పూర్తిగా నిర్మాణాలు చేపట్టలేదు. మరికొన్ని గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టినప్పటికీ అసంపూర్తిగానే దర్శనమి స్తున్నాయి. ఇంకొన్ని గ్రామాల్లో లేఅవుట్‌ ఇచ్చినప్పటికీ కోర్టు పెండింగ్‌తో కనీసం ఒక్క ఇల్లు కూడా నిర్మాణాలు చేపట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి. ఒకవేళ ఇవన్నీ ఎదుర్కొని ఇళ్లు నిర్మించినా ప్రభుత్వం వాటికి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.కోర్టు స్టేలతో నిలిపివేతకొన్ని గ్రామాల్లో గత ప్రభుత్వాలు ఇచ్చిన డి పట్టా భూమును ప్రజల వద్ద నుంచి రెవెన్యూ అధికారులు తిరిగి తీసుకొని లేఅవుట్లే వేశారు. దీంతో డి పట్టాదారులు కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా కోర్టు స్టే ఇచ్చింది. దీంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. జగనన్న కాలనీ ఊర్లనే తలపిస్తుందన్న ప్రభుత్వ ఊక దంపుడు ప్రసంగాలు, ప్రకటనకు అడ్డుక్ట పడింది. మండలంలోని గుల్లపాడు పంచాయతీ పరిధిలోని కొండల మామిడి వలసలో సర్వే నెంబరు1లో కొండ పోరంబోకులో రేగిడి, ఆముదాలవలస, మజ్జిరాముడు పేట, అంబకండి, సంకిలితో పాటు మరో మూడు పంచాయతీలకు జగనన్న కాలనీ మంజూరు చేశారు. 220 జగనన్న కాలనీలకు 55 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 165 వివిధ స్థాయి నిర్మాణాల్లోనే ఉన్నాయి. ఇక్కడ రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. కాగితాపల్లి పంచాయతీలో 24 గృహాలు పూర్తిగా నిర్మాణాలు చేపట్టకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంకిలి గ్రామంలో సర్వే నెంబరు 319లో 75 గృహాలు, 97లో 38 గృహాలు లే అవుట్‌కే పరిమితమయ్యాయి. ఇక్కడ గతంలో ఎస్‌సి లబ్ధిదారునికి డి. పట్టా ఇచ్చారు. ఆయన జీడి మామిడి వేశారు. తిరిగి ఆ భూమిని ప్రభుత్వం వెనుక్కు తీసుకుని జగనన్న కాలనీకు ఇవ్వటంతో వన్నలి జనార్ధన కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే విధించింది. నారు జనార్ధన, పట్టాభిలకు చెందిన 25 ఏళ్లుగా హక్కుల ఉన్న స్థలంలో జగనన్న కాలనీకి స్థలం కేటాయించారు. వీరు కూడా కోర్టుకు వెళ్లడంతో స్టే వచ్చి నిర్మాణాలు జరగలేదు. ఖండ్యాంలో 18, వెంకటాపురంలో 20 గృహాలు కట్టలేదు. మునగలవలసలో 9 కి నాలుగు నిర్మాణాలు చేపట్టలేదు. వెంకంపేటలో 11 గృహాలకు ఒకటి మాత్రమే పూర్తిచేసి 10 అసంపూర్తిగా ఉన్నాయి. తోకలవలసలో 7, సరసనా పల్లెలో 6, సోమరాజుపేట 6 గృహాలకు పూర్తిగా నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే 160 జగనన్న కాలనీలో గృహాలు పూర్తిగా నిర్మాణాలే చేపట్టలేకపోయారు.నిర్మాణానికి చాలని నిధులుజగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.1.80లక్షలు ఇసుక, సిమెంటుకే చాలడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. అది కూడా కొండ ప్రాంతంలో జగనన్న కాలనీకు స్థలం మంజూరు చేయటంతో సమాన ప్రాతిపదికన పునాదులకే ఐదు లక్షల రూపాయలు అవుతుందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. గతంలో ప్రభుత్వమే జగనన్న కాలనీలు నిర్మిస్తోందని చెప్పి, ఇప్పుడు లబ్ధిదారులే నిర్మించుకోవాలని అధికారులు చెబుతుంటే ఆశ్చర్యానికి లోనయ్యామని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులతో నిర్మాణాలు కష్టమని నిర్మాణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరిగాయని, కూలీ రేటు కూడా పెరిగిందని ఈ నేపథ్యంలో ప్రభుత్వమే జగనన్న కాలనీలను నిర్మించాలని కోరుతున్నారు. కాగా నిర్మాణాలు పూర్తయిన జగనన్న కాలనీలకు రహదారులు, తాగనీరు, విద్యుత్‌ వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిర్మాణాలు వేగవంతానికి చర్యలుజగనన్న కాలనీ నిర్మాణంలో జాప్యం వాస్తవం. నిర్మించిన కాలనీలకు రోడ్లు నిర్మాణాలపైనా జాప్యం ఉంది. కాలనీ నిర్మాణాలకు వేగవంతానికి చర్యలు తీసుకుంటాం. లబ్ధిదారు లకు అవగాహన కల్పించినా ముందుకు రావడం లేదు. నిర్మాణంలో జిల్లాలో రేగిడి మండల ముందంజలో ఉంది. స్థానిక నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్మాణాలకు కృషి చేస్తాం.జగన్నాథరావు, హౌసింగ్‌ ఎఇ, రేగిడి

➡️