బిజెపి ఎంపీ అభ్యర్థి సిఎం.రమేష్‌ను ఓడించాలి

ప్రజాశక్తి-దేవరాపల్లి

అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి సిఎం.రమేష్‌ను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న, వి.మాడుగుల, దేవరాపల్లి మండలాల కార్యదర్శులు ఇరట నరసింహమూర్తి, బిటి.దొర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు మండలంలోని వాలాబు, గర్సింగి పంచాయతీల పరిధిలో సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎం రమేష్‌ లాంటి పారిశ్రామికవేత్తలను వలస తీసుకొచ్చిన బిజెపి, ఎలాగైనా గెలవడం కోసం కిరాయి మనుషులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే జిల్లాలో వేలాది మంది కాషాయి మూకలను దింపి డబ్బు, మద్యం పంపకానికి సిద్ధం చేసిందన్నారు. ఇటువంటి వ్వక్తులను పార్లమెంటుకు పంపిస్తే ఎంతో ప్రమాదమో జిల్లా ప్రజలు ఆలోచించాలన్నారు. మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు పూనుకుందని, గిరిజనులకు రక్షణగా ఉన్న అటవీ సంరక్షణ చట్టాన్ని సవరించి అటవీ ప్రాంతాన్ని అదాని వంటి కార్పొరేట్లకు కట్టబెట్టడానికి పూనుకుందని తెలిపారు. మరో సారి బిజెపి గెలిస్తే భవిష్యత్‌లో ఎన్నికలు ఉండవని, రాజ్యంగాన్ని పూర్తిగా రద్దు చేస్తారని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలను ప్రజలు అర్థం చేసుకోని బిజెపి, ఎన్‌డిఎ కూటమి అభ్యర్థులను ఓడించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేశారు.

➡️