ఎల్‌ఐసి ఉద్యోగుల రక్తదానం

Jul 1,2024 21:39

ప్రజాశక్తి- గరివిడి, విజయనగరంటౌన్‌ : ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌, వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఎల్‌ఐసి బ్రాంచ్‌ కార్యాలయాల్లో సోమవారం ఘనంగా జరిగాయి. గరివిడి, విజయనగరంలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు విజయ వంతమయ్యాయి. విజయనగరం బ్రాంచిలో రక్తదాన శిబిరం, మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. తిరుమల-మెడికవర్‌ ఆస్పత్రి ఎమ్‌డి డాక్టర్‌ తిరుమల ప్రసాద్‌, ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షులు జెసి నాయుడు పరిశీలించారు. ఎల్‌ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు, అధికారులు రక్తదానం చేశారు. ఐసిఇయు విజయనగరం యూనిట్‌ అధ్యక్షులు పి.శ్రీనివాసరావు, కార్యదర్శి ఆర్‌.అప్పల నాయుడు, రిటైర్డు ఉద్యోగుల సంఘం నాయకులు ఎ.శ్రీనివాస్‌, ఎం.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. గరివిడిలో విజయనగరం ఎన్‌విఎన్‌ రక్తనిధి కేంద్రం బృందం సభ్యులు ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌, ఏజెంట్స్‌, స్థానిక రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా గరివిడి సీనియర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ విజయశ్రీ, ఐసిఐయు విజయనగరం రూరల్‌ ఉపాధ్యక్షుడు జి సిద్ధార్థ, గరివిడి బేస్‌ యూనిట్‌ కార్యదర్శి దత్తి వెంకటేష్‌, తదితరులు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు రక్త నిల్వలు పెంపొందించడం అవసరమని, ఇందుకు ఇలాంటి స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు దోహదపడతాయని అన్నారు.సందర్భంగా సీనియర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ విజయశ్రీ, యూనియన్‌ ఉపాధ్యక్షులు సిద్దు, తదితరులను ఘనంగా సత్కరించారు.

➡️