రక్తికట్టించిన ‘లవకుశ’

Jul 2,2024 00:47 #Surabi natakalu
surabi natakalu

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) శ్రీ భానోదయ నాట్యమండలి (సురభి) హైదరాబాద్‌ 140వ వార్షికోత్సవ సందర్భంగా విశాఖలోని కళాభారతిలో నిర్వహిస్తున్న నాటకోత్సవాల్లో భాగంగా మూడవరోజు లవకుశ నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. కళాకారులు తమతమ పాత్రలను రక్తి కట్టించారు. నాటకంలో భాగంగా శ్రీరామ పట్టాభిషేకం, గర్భవతిగా ఉన్న సీతను శ్రీరాముడు బహిష్కరించడం, శ్రీరాముడు ఆదర్శ పురుషునిగా జీవించడం, సీత అడవికి వెళ్ళడం, అక్కడ కవలలు జన్మించడం తదితర సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పూర్వ డిప్యూటీ మేయర్‌ డాక్టర్‌ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ, అంతరించి పోతుందనుకున్న సురభి నాటక సంస్కృతిని పరిరక్షించి నేటికీ నిలిచేలా చేసిన మహనీయుడు పద్మశ్రీ బాబ్జి అని కొనియాడారు. సురభి కుటుంబం చెక్కు చెదరకుండా నాటకమే జీవనోపాధిగా అప్పుడే పుట్టిన పాపాయి మొదలు అన్ని వయసుల వారు అన్ని పాత్రలూ పోషిస్తుండటం వారికే చెల్లిందన్నారు. సురభి పౌరాణిక చారిత్రాత్మక సంప్రదాయాన్ని విశాఖకు పరిచయం చేసి ఉత్తరాంధ్రకు చేరువ చేస్తున్న ఆ కుటుంబ సన్నిహితుడు బాదంగీర్‌ సాయి విశాఖ వాసి కావడం గర్వకారణమన్నారు. బాదంగీర్‌ సాయి మాట్లాడుతూ, రంగశాయి నాటక సంఘం ఆధ్వర్యాన పద్మశ్రీ బాబ్జి పేరుతో ఆయన జీవితకాల పురస్కారం నాటక రంగ ప్రముఖులకు ప్రదానం చేస్తున్నట్లుగా చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన కళాభారతి వేదికపై పద్మశ్రీ సురభి బాబ్జి జీవితకాల పురస్కారం ఒక నాటక రంగ ప్రముఖునికి ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగనబోయిన నాగేశ్వరరావు, నంది అవార్డుల గ్రహీత డాక్టర్‌ మీగడ రామలింగస్వామి, ఏవీఎన్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.సింహాద్రి నాయుడు, పద్మశ్రీ సురభి బాబ్జి అవార్డు గ్రహీత నవరసమూర్తి, నటులు, దర్శకులు కెవిఎన్‌డి.ప్రసాద్‌, వర్రె నాంచారయ్య, శివజ్యోతి, కన్నబాబు, పైడి శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️