అభ్యర్థులు ప్రవర్తనా నియమావళిని పాటించాలి

Apr 30,2024 21:24

ప్రజాశక్తి-విజయనగరం కోట :ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి అన్నారు. ఎన్నికల ప్రక్రియ, నియమ నిబంధనలను, ఎన్నికల కోడ్‌పై అభ్యర్థులకు, వారి ప్రతినిధులకు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మంగళవారం అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు, ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీష్‌ చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా, వ్యయ పరిశీలకులు ప్రభాకర్‌ ప్రకాష్‌ రంజన్‌, ఆనంద్‌ కుమార్‌, ఆకాష్‌దీప్‌ పాల్గొని అభ్యర్ధులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ, అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి మే 7 వరకు ఇంటింటికీ ఓటర్‌ స్లిప్పుల పంపిణీని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ స్లిప్పులతో పాటు ఓటరు గైడ్లను కూడా అందజేస్తారని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఎటువంటి పార్టీ గుర్తు గానీ, రంగు, పేరు లేకుండా మాత్రమే అనధికారికంగా ఓటరు స్లిప్పులను పంచుకోవచ్చునని సూచించారు. పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల లోపల ఎక్కడా పార్టీ బూత్‌లను ఏర్పాటు చేయకూడదన్నారు. ఓటర్లను పోలింగ్‌ కేంద్రానికి తరలించడానికి వాహనాలను ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేశారు. అంథులకోసం బ్రెయిలీలో కూడా నమూనా బ్యాలెట్‌ పత్రాలను పోలింగ్‌ బూత్‌లవద్ద ఉంచుతామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌, హోమ్‌ ఓటింగ్‌, ఆబ్‌సెంటీ ఓటింగ్‌ ప్రక్రియలను వివరించారు. హోం ఓటింగ్‌కి ఇంటింటికీ వెళ్లేటప్పుడు అభ్యర్ధుల ఏజెంట్లను కూడా అనుమతిస్తామని తెలిపారు. పోలింగ్‌ ఏజెంట్స్‌ తమతోపాటు తప్పనిసరిగా ఎపిక్‌ కార్డులను తీసుకురావాలని స్పష్టం చేశారు. మే 11వ తేదీ సాయంత్రం నుంచీ నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయని, ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్‌ అమలు చేయబడుతుందని, ఇతర నియోజకవర్గాలకు చెందిన వ్యక్తులు ఉండకూడదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సాధారణ పరిశీలకులు హనీష్‌ చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌ మాట్లాడుతూ, జిల్లాలో స్వేచ్చగా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు పార్టీలు, అభ్యర్ధులు సహకరించాలని కోరారు. ఏమైనా ఫిర్యాదులుంటే ఆర్‌ఒలకు గానీ లేదా నేరుగా తమకు గానీ ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. అభ్యర్ధుల సందేహాలను నివత్తి చేశారు. అభ్యర్ధుల ఖర్చులకు సంబంధించిన నియమ నిబంధనలను వ్యయ పరిశీలకులు ప్రభాకర్‌ ప్రకాష్‌ రంజన్‌, ఆనంద్‌ కుమార్‌, ఆకాష్‌దీప్‌ వివరించారు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధులు రూ.40 లక్షలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్ధులు రూ.95 లక్షలు వరకు ఖర్చు చేయవచ్చునని తెలిపారు. పోటీ చేసే ప్రతీ అభ్యర్థి తమ ఎన్నికల ఖర్చు వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, ట్రైనింగ్స్‌ నోడల్‌ ఆఫీసర్‌ సుధాకరరావు, రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులు, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️