రేపటి విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి

Jul 2,2024 23:41

బంద్‌ నోటీసు ఇస్తున్న నాయకులు
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
అసమర్ధ ఎన్‌టిఎను రద్దు చేయాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యుఐ, పిడిఎస్‌యు తదితర విద్యా సంఘాల ఆధ్వర్యంలో 4న నిర్వహించే విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని నాయకులు కోరారు. ఈ మేరకు స్థానిక ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని, నీట్‌ పరీక్షల్లో అవకతవకలను నిగ్గు తేల్చాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ ఆధ్వర్యంలో బంద్‌ చేస్తున్నట్లు చెప్పారు. 4న కేజీ టు పీజీ విద్యాసంస్థలను దేశవ్యాప్తంగా బంద్‌ చేస్తామని, జయప్రదం చేయాలని కోరారు. బంద్‌కు చిలకలూరిపేట పట్టణంలోని విద్యాసంస్థలూ సహకరించాలన్నారు. ఈ మేరకు ఇప్పటికే విద్యాసంస్థలు పాఠశాలలకు నోటీసులు అందించామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు టి.సాహిత్‌, కె.గోపి, ఎ.శ్రీనివాస్‌, కె.సన్నీ, ఎన్‌.సాయి శ్రీనాథ్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-సత్తెనపల్లి : విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు డి.అమూల్య కోరారు. ఈ మేరకు స్థానిక పుతుంబాక భవన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షులు సత్తి అధ్యక్షతన జరిగిన సభలో అమూల్య మాట్లాడారు. నెట్‌, నీట్‌ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పీహెచ్‌డి అడ్మిషన్ల కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్‌ స్కోర్‌ విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. టిఐఎస్‌ఎస్‌ ముంబయి, ఐఐటి ముంబాయి నుండి హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘాల నేతలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, యూనివర్సిటీల్లో ప్రజాస్వామ్యం అణచివేత ఆపాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపాలని, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని కోరారు. ఈ అంశాలపై 4న నిర్వహించే బంద్‌కు అందరూ సహకరించాలని కోరారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ ఉపాధ్యక్షులు ఇశాంత్‌ మాట్లాడారు.

➡️