గల్లీస్థాయికి దిగజారిన చంద్రబాబు

Apr 23,2024 22:01

ప్రజాశక్తి-శృంగవరపుకోట : అసత్య ఆరోపణలతో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు గల్లీ స్థాయికి దిగజారారని శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు విరుచుకుపడ్డారు. తనపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని సవాల్‌ విసిరారు. సోమవారం ప్రజాగళం యాత్రలో టిడిపి అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం పట్టణంలోని వైసిపి కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడుబండి మాట్లాడుతూ అబద్దాలతో ఆటలు సాగవన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏం చేస్తామో చెప్పలేని 40 ఇయర్స్‌ ఇండిస్టీ శృంగవరపుకోటలో చతికిలపడి చవకబారు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను కొండ తవ్వి రూ.50 కోట్లతో కొత్తవలసలో ప్యాలెస్‌ కట్టానని అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. అది తన అత్తవారిచ్చిన స్థలంలో కట్టిన ఇల్లని చెప్పారు. రూ.20 కోట్లు ఇస్తే తన ఇల్లు రాసిచ్చేస్తానని చంద్రబాబుకు సవాల్‌చేశారు. రెల్లిలో 100 ఎకరాలున్నట్లు ఆరోపించారని, అక్కడ సెంటు భూమి కూడా లేదని స్పష్టంచేశారు. 40 ఏళ్ల చంద్రబాబు అనుభవం.. ఇక్కడ గల్లీ నాయకులు రాసిచ్చిన చీటీలు చదివే స్థాయికి దిగజారడం దౌర్భాగ్యమని దుయ్యబట్టారు. ఒక్కరూపాయి అవినీతి చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, డిసిసిబి చైర్మన్‌ వేచలపు చినరామునాయుడు, కల్చరల్‌ అండ్‌ ఫోక్‌ డైరెక్టర్‌ వాకాడ రాంబాబు, వైసిపి మండల అధ్యక్షులు మోపాడ కుమార్‌, వైస్‌ ఎంపిపి పినిశెట్టి వెంకటరమణ, పోతనపల్లి వెంకటరావు, కృష్ణాపురం సర్పంచ్‌ యామిని దేవి, తదితరులు పాల్గొన్నారు.

➡️