అంగన్‌వాడీలకు ‘అందరి’ మద్దతు

Dec 29,2023 23:05
అంగన్‌వాడీలకు 'అందరి' మద్దతు

ప్రజాశక్తి – చిత్తూరు అర్బన్‌, యంత్రాంగం: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సమ్మెకు మద్దతుగా చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద సిఐటియు -ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు దాసరి చంద్ర మాట్లాడుతూ 18 రోజులగా అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్య దోరణితో వ్యవహరించడం దారుణమన్నారు. మంత్రి వర్గం చర్చలు పేరుతో దాటవేస్తున్నారని సరైన పద్ధతి కాదని విమర్శించారు. మరోపక్క మంత్రులు, ఎమ్మెల్యేలు అంగన్వాడీలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే పని చేస్తున్నారు.ఈ తప్పుడు ప్రచారాన్ని వెంటనే మానుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం వేయి రూపాయలు మాత్రమే పెంచి చేతులు దులుపుకున్నదని, ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా వేయి రూపాయలు వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వారు చేస్తున్న పోరాటం ఉదతం కాకముందే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. అలాగే సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కారం చేయాలని, మున్సిపల్‌ కార్మికుల సమ్మె చర్చలు కూడా విఫలమైనాయని వెంటనే మున్సిపల్‌ కార్మికులు సమస్యలు కూడా పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గాంధీ విగ్రహంకు వినతిపత్రం ఇస్తూ కార్మికులు సమస్యలు పరిష్కారం చేసే బుద్ధి కలిగించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటీయూసీ,ఎస్టియు నాయకులు గంటా మోహన్‌ లతో పాటు కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.శ్రీ పలమనేరులో వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి దడాల సుబ్బారావు, బిసిఎఫ్‌ నాయకులు అద్దంకి రమణమూర్తి సంఘీభావాన్ని తెలిపారు. పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. గుడియాత్తం రోడ్డు వద్ద సమావేశం జరిగింది. నాయకులు గిరిధర్‌గుప్తా, ఓబుల్‌రాజు, మద్దెల సుబ్రమణ్యం, , రాధ, వెంకటప్ప పాల్గొన్నారు. దడాల సుబ్బారావు మాట్లాడుతూ తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీనే నెరవేర్చాలని కోరుతున్నామన్నారు.శ్రీ యాదమరిలో విసికె పార్టీ పూతలపట్టు ఇన్‌ఛార్జి సంతోష్‌ మద్దతు ప్రకటించారు. నాయకులు ఏసన్న పాల్గొన్నారు. శ్రీ బైరెడ్డిపల్లిలో తహశీల్దార్‌ కార్యాలయం నుంచి సచివాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. జడ్‌పిటిసి కేశవులు ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళతానని చెప్పారు. జనసేన మండల అధ్యక్షులు చైతన్యకుమార్‌, జనరల్‌ సెక్రటరీ దినేష్‌ పాల్గొన్నారు. శ్రీ కార్వేటినగరంలో వెదురుకుప్పం, శ్రీరంగరాజపురం మండలాలకు చెందిన కార్యకర్తలు కళ్లకు నిల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. సిఐటియు నాయకులు మమత, ఎఐటియుసి కార్యదర్శి రాధమ్మ పాల్గొన్నారు.

➡️