అటకెక్కిన అమృత్‌…

Mar 11,2024 22:02
అటకెక్కిన అమృత్‌...

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ చిత్తూరు నగరంలోని ఇంటింటికీ సురక్షిత మంచినీటి సరఫరా కళగానే మిగిలింది. నగరవాసుల తాగునీటి కష్టాలు తీర్చేలా గత ఏడాది సెప్టెంబర్‌ 9వ తేదీ స్థానిక కైలాసపురం వద్ద భారీగా ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణానికి నగర పాలక సంస్థ అమృత్‌ పథకం క్రింద రూ.29.20 కోట్లతో ఓవర్‌ హెడ ్‌ట్యాంకుల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, అధికారులు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ టెండర్‌ హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ కంపెనీ దక్కించుకుంది. వెంటనే పనులు ప్రారంభించి దాదాపు ఆరు నెలల పాటు ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నిర్మాణాన్ని చేపట్టింది. అయితే ప్రభుత్వం నుంచి బిల్లులు అందకపోవడంతో పనులు అర్థాతరంగా ట్యాంకు నిర్మాణం ఆగిపోయింది. అమృత్‌ పథకం నిధులతో చిత్తూరు నగర వాసులు శాశ్వత సురక్షిత తాగునీటిని అందించేందుకు అడవిపల్లి రిజర్వాయర్‌ నుంచి పైపులైన్లు ద్వారా కైలాసపురం వద్ద నిర్మించే ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను నీటిని తరలించి అక్కడి నుంచి నగరంలోని ఇంటింటికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలన్నదే ఈ పథకం ముఖ్యఉద్యేశం అయితే ట్యాంకు నిర్మాణం మాత్రం అర్థాతరంగా ఆగిపోయింది. టెండర్‌ తీసుకున్న కంపెనీకి నిధులు రాకపోవడంతో ఆపేసినట్లు కొందరు చెబుతున్నారు.ఇంటింటికీ సురక్షిత తాగునీరు కలేనా… చిత్తూరు అనగానే గుర్తుకు వచ్చే సమస్య తాగునీటి సమస్య… ప్రస్తుతం వేసవి కాలం సమీపించడంతో నగరంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో ప్రైవేట్‌ నీటి సరఫరా ట్యాంకర్లకు గిరాకీ బాగా పెరింది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న ప్రైవేట్‌ నీటి సరఫరా ట్యాంకర్ల యజమానులు ట్యాంకరు నీటికి రూ.400 నుంచి 600ల వరకు తీసుకుంటున్నారు. ఒక్క చిత్తూరు నగరంలోనే నీటి వ్యాపారం కోట్లల్లో జరుగుతోంది. ప్రభుత్వాలు మారినా… పాలకులు మారినా.. చిత్తూరు వాసుల తాగునీటి సమస్యకు మాత్రం పరిష్కారం చూపలేకపోయారు. ప్రతి సంవత్సరం వేసవిలో నగరవాసులు నీటి కష్టాలను ఎదుర్కోక తప్పడం లేదు. నగరంలో రెండు లక్షలకు పైగా ఉన్న జనాభాకు ఏకైక నీటి సరఫరా పూనేపల్లి వద్ద ఎన్‌టిఆర్‌ జలాశయం మాత్రమే.. ఇతర మార్గాలు లేవు.. కొందరు బోర్ల ద్వారా నీటిని వాడుకుంటున్నా అవి మరమ్మతులకు గురైనా, భూగర్భజనాలు అడుగంటినా ఇక వారి నీటి కష్టాలు వర్ణణాతీతం. వేసవి ప్రారంభానికి ముందే నగరంలో నీటి కష్టాలు ఇలా ఉంటే.. ఇక నడి వేసవిలో పరిస్థితి ఏమిటని ప్రజలకు ఆందోళన చెందుతున్నారు.సురక్షిత నీటి సరఫరా పథకం ఎందుకు ఆగింది.. రూ. 29.20లక్షలతో చేపట్టిన అమృత్‌ పథకం అర్థాతరంగా ఆగిపోయింది. ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నిర్మాణం ఏడాదిలోపు పూర్తి చేస్తామని నగర పాలక సంస్థ ప్రకటించి ఏడాది కావస్తోంది. ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మాణం కోసం బెస్‌మెంట్‌ వేసి నిర్మాణ పనులు ఆపేశారు. సురక్షిత తాగునీటిని అందిస్తారని ఆశించిన నగరవాసులు ఆశలపై నీళ్లు చల్లారు. శాశ్వత తాగునీటి సరఫరా పథకం ఆగిపోవడంతో కారణాలు ఎవర్ని అడగాలో తెలియక సతమతమౌతున్నారు. కారణాలు ఏమైనప్పటికీ చిత్తూరుకు శాశ్వత తాగునీటిని అందించాలని నగర వాసులు కోతున్నారు.

➡️