‘ఎస్మా’కు భయపడం

Jan 6,2024 21:50

కలెక్టరేట్‌ ఎదుట అంగన్వాడీల నిరవధిక దీక్షలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జీతాలు పెంపు, గ్రాట్యూటీ అమలు విషయంలో తగ్గేదేలే… అంటూ పోరాడుతున్న అంగన్వాడీలు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తూ చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట శనివారం నిరవధిక దీక్షలకు పూనుకున్నారు. ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్ల విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు సమ్మె కొనసాగుతుందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షకిల స్పష్టం చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం ఎంత వరకు సమజసమని, ఎస్మాలకు భయపడేది లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కీమ్‌ వర్కర్స్‌ అయిన అంగన్వాడీలకు ఎస్మా వర్తించదన్నారు. పాదయాత్ర సందర్భంగా నేటి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే ఎస్మా చట్టం ద్వారా అణచివేసే ప్రయత్నం చేస్తోందన్నారు. సుదీర్ఘ పోరాట అనుభవం ఉన్న అంగన్వాడీల సత్తాను ప్రభుత్వం తక్కువ అంచనా వస్తోందని తీరు మార్చుకోకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అంగన్వాడీల పోరాటానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు వాడ గంగరాజు మద్దతు ప్రకటించారు. అంగన్వాడీలపై ప్రభుత్వం నిర్భందం ప్రయోగిస్తోందని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సుప్రీం కోర్టు తీర్పులను అమలు చేయమని కోరడం నేరమా అని ప్రశ్నించారు. ఎస్మాలకు భయపడే స్థితి లేదన్నారు. ఇచ్చిన మాట తప్పిన జగన్‌ ప్రభుత్వాని ఇంటికి పంపే రోజులు దగ్గరపడ్డాయన్నారు. అంగన్వాడీల పోరాటానికి తెలుగుదేశం నేతలు మాజీ ఎంఎల్‌సీ దొరబాబు నాయకులు చంద్రప్రకాష్‌, సప్తగిరి ప్రసాద్‌, మోహన్‌రాజ్‌లు మద్దతు తెలిపారు. బట్టన్లు నొక్కి ప్రజల చెవిలో పువ్వులు పెట్టిన జగన్‌ను ఇంటికి పంపేలా మూడు నెలల తరువాత బలంగా బటన్‌ నొక్కి ఇంటికి పంపాలన్నారు. అంగన్వాడీల పోరాటం న్యాయమైనదని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల జీతాల పెంపు, గ్రాట్యూటీ అమలు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సృజని, ప్రభావతి, జ్యోతి, చిత్తూరు ప్రాజెక్టులోని గుడిపాల, చిత్తూరు రూరల్‌, అర్బన్‌ అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమ్మెపై ఎస్మా వెంటనే ఉపసంహరించుకోవాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజుఅంగన్వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ జీవో నెంబర్‌ 2 తీసుకురావడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 26రోజులు శాంతియుతంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీల సమ్మెపై ఎస్మాను చట్టపరిధిలోకి తీసుకురావడం సమ్మెను నిషేధించడం అప్రజాస్వామ్యమని ధ్వజమెత్తారు. సమస్యలను పరిష్కారం చేయకుండా సమ్మె చేయకుండా నిషేధించడం వేతనాల్లో కోత విధిస్తామని చెప్పడమే అన్నారు. న్యాయబద్ధమైన సమ్మెను అక్రమ మార్గంలో సమ్మెను విచ్ఛిన్నం చేయడం అభ్యంతరకరమన్నారు. ఇదే పద్ధతి కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అన్ని కార్మిక సంఘాలు ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించి, కలిసి రావాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీల సమస్య పరిష్కారమయేంత వరకు ప్రత్యక్షంగా సిపిఎం మద్దతు తెలియజేస్తుందని పిలుపునిచ్చారు.పుంగనూరు: రాష్ట్రంలో వైయస్సార్‌ ప్రభుత్వానికి అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన సమస్యల కోసం చేపట్టిన పోరాటం పట్టదా అంటూ అంగన్వాడీలు ప్రశ్నించారు. పుంగనూరు రూరల్‌ రాంపల్లి సమీపంలో ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్‌ రెడ్డి అంగన్వాడీల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి తీరా గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోకపోవడం ఎంత వరకు సమజసమని ప్రశ్నించారు. అంగన్వాడీ రత్నమ్మ, సునంద, ఉమా పాల్గొన్నారు.

➡️