కంటి చూపునిస్తే ప్రపంచాన్ని ఇచ్చినట్లే: ఆర్కేరోజా

కంటి చూపునిస్తే ప్రపంచాన్ని ఇచ్చినట్లే: ఆర్కేరోజా

కంటి చూపునిస్తే ప్రపంచాన్ని ఇచ్చినట్లే: ఆర్కేరోజాప్రజాశక్తి- నగరి: కంటి చూపు పోతే ప్రపంచం వారికి చీకటై పోతుందని అలాంటిది వారికి కంటి చూపునిస్తే ప్రపంచాన్నే వారికి ఇచ్చినట్లని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. బుధవారం తన నివాసకార్యాలయం వద్ద మెగా ఉచిత కంటివైద్య శిబిరాన్ని, మొబైల్‌ ఐ సర్జికల్‌ యూనిట్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. దూరప్రాంతాలకు వెళ్లడానికి తోడు లేకపోవడం, ఖర్చు భరించి వెళ్లలేక పోవడం ఇలాంటి సమస్యల కారణంగా పలువురు కంటి వ్యాధులు ఉన్నా చికిత్స చేసుకోలేకపోతున్నారని అన్నారు. అలాంటి వారికి నియోజకవర్గంలోనే వారికి అందుబాటులో వారి చెంతకే అత్యున్నత వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతిరోజు 300 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇలా 8 రోజుల పాటు జరుగుతుందన్నారు. ఆపరేషన్‌ అవసరమైన వారిని గుర్తించి వారికి తగిన మందులు ఇస్తారని అది వైద్యులు చెప్పే సూచనల ప్రకారం వాడుతూ వస్తే ఇక్కడే మొబైల్‌ సర్జికల్‌ యూనిట్‌లో ఆపరేషన్‌ చేసి రెండు గంటల తరువాత ఇంటికి పంపుతారన్నారు. ఇంత పెద్దఎత్తున నిర్వహించే మెగా వైద్యశిబిరాన్ని వినియోగించుకునే అవకాశాన్ని కంటి సంబంధిత సమస్యలున్నవారు వాడుకునేలా చెయ్యాలన్నారు. ఖర్చులు భరించి సేవచేసేవారికన్నా అది పరులకు చెప్పి సేవలందుకునేలా చేసేవారికే పుణ్యం దక్కుతుందన్నారు. పేదప్రజలకు సేవచేయాలన్న సంకల్పమే ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణమని ప్రతిగా వారు నిండుమనసుతో ఆశీర్వదిస్తే చాలన్నారు. ఆమె కూడా వైద్య శిబిరంలో కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శంకరనేత్రాలయ కంటి వైద్య శిబిరం నగరి పట్టణంలో నేడు రెండోసారి జరుపుతున్నామంటే అది మంత్రి పట్టువదలని చొరవతోనే అని శంకరనేత్రాలయ ప్రతినిధి అరుళ్‌కుమార్‌ అన్నారు. పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌ హరి, నిండ్ర ఎంపీపీ దీప, శంకరనేత్రాలయ జిల్లా ఇన్‌చార్జి అర్పిత, సిబ్బంది, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

➡️