చిత్తూరు టికెట్‌ గురజాలకే..?

చిత్తూరు టికెట్‌ గురజాలకే..?

చిత్తూరు టికెట్‌ గురజాలకే..?ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: అధికార పార్టీ వైసిపి చిత్తూరు నియోజకవర్గ బరిలో దింపిన ఎంసీ విజయానందరెడ్డికి ధీటైన వ్యక్తిగా గురజాల జగన్మోహన్‌ను టిడిపి అభ్యర్థిగా ఖరారు చేయనున్నట్లు టిడిపి నేతలు భావిస్తున్నారు. గురజాల జగన్మోహన్‌ అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయినట్లేనని చెబుతున్నారు. చిత్తూరు నియోజక వర్గంలో గురజాల జగన్మోహన్‌ సేవా కార్యక్రమాలతో లేదా బడుగు, బలహీన వర్గాలకు చేరువ కావడంతో పాటు జిల్లా కేంద్రమైన చిత్తూరులో పసుపు జెండా రెపరెపలాడింది. టిడిపిలో అప్పటి వరకు ఓ రకంగాను, గురజాల జగన్మోహన్‌ అడుగుపెట్టాక మరో విధంగా మారిపోయింది. చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు అర్బన్‌, రూరల్‌, గుడిపాల మండలాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు, టిడిపి అనుబంధ సంఘాల్లో నూతన ఉత్సాహం, ఉత్తేజాన్ని కలిగించారు. అప్పటివరకు నగరంలో అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు, బ్యానర్లు, భారీ కటౌట్ల స్థానంలో ప్రతిపక్ష టిడిపి ముఖ్య నేతల ఫ్లెక్సీలు, బేనర్లు, కటౌట్లు గోడ పత్రికలు వెలిశాయి. గురజాల జగన్మోహన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సేవా కార్యక్రమాలను అనతి కాలంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చిత్తూరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. చిత్తూరు టికెట్‌ గురజాలకు ఖరారు అయిన వెంటనే అధికార పార్టీ నుండి ద్వితీయ శ్రేణి నాయకత్వం, కొందరు కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు టిడిపి కండువాలు కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ నాయకులు కార్యకర్తలలో గురజాల జగన్మోహన్‌ టిడిపి ఆశయాలను ముందుకు తీసుకు పోయేలా ఆత్మవిశ్వాసాన్ని నింపారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు జనసేన నాయకత్వం గురజాల జగన్మోహన్‌ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ గురజాల జగన్మోహన్‌ అయితేనే చిత్తూరులో విజయ అవకాశాలు ఉంటాయని బలంగా భావిస్తున్నట్లు సమాచారం. గురజాల జగన్మోహన్‌ చిత్తూరు నుండి పోటీ చేస్తే గుడిపాల సొంత మండలం కావడం కలిసొస్తుందని టిడిపి కంచుకోటగా ఉన్న గుడిపాల మండలం తిరిగి ఆ పార్టీ కంచుకోటగా మారే అవకాశం ఉంది. గుడిపాల మండలానికి చెందిన గురజాల జగన్మోహన్‌ నాయుడు ఇటీవల కాలంలో క్రియాశీలకమయ్యారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలన్నీ ఆయన ఆధ్వర్యంలోని జరుగుతున్నాయి. పేదలకు నాలుగు చక్రాల బండ్లను పంచడం, నిత్యావసర వస్తువులు పంచడం తదితర కార్యక్రమాలతో జగన్‌ మోహన్‌ నాయుడు ప్రజల్లోకి వెళుతున్నారు. దాన ధర్మాలు కూడా చేస్తున్నారు. యువగళం ముగింపు యాత్రకు కూడా ఆయన 40 లక్ష రూపాయల వ్యయంతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆధ్వర్యంలో టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థులందరూ చిత్తూరు పట్టణంలో ఇంటింటికి తిరిగి తిగిరి తమ పార్టీనే గెలిపించాలని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.

➡️