టీబీపై అవగాహన కలిగి ఉండాలి ర్యాలీ ప్రారంభోత్సవంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభావతి దేవి

టీబీపై అవగాహన కలిగి ఉండాలి ర్యాలీ ప్రారంభోత్సవంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభావతి దేవిప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: టీబీపై అవగాహన కలిగి వుండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభావతి దేవి అన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభావతి దేవి ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ క్షయ నిర్మూలనలో భాగంగా ఈ సంవత్సరం ‘అవును క్షయ (టిబి)ని అంతం చేయవచ్చును’ అనే నినాదంతో ప్రజల ముందుకు వెళుతున్నామన్నారు. టీబీ ‘మైకో బ్యాక్టీరియం ట్యూబర్కులే అనే బ్యాక్టీరియా’ ద్వారా వ్యాపిస్తుందని , జబ్బు ఉన్న వ్యక్తి తుమ్మినప్పుడు తుంపర్లు ఆరోగ్యవంతులు పీల్చినప్పుడు వ్యాప్తి చెందుతుందన్నారు. శరీరంలో వెంట్రుకలు, గోర్లు తప్ప ఏ భాగానికైనా టీబీ రావచ్చునని తెలిపారు. రెండు వారాల మించి దగ్గు , ఛాతీలో నొప్పి, సాయంకాలం పూట జ్వరం రావడం, బరువు తగ్గిపోవడం, ఆకలి పూర్తిగా లేకుండా వుండటం వంటివి ఈ వ్యాధి లక్షణాలు అని తెలిపారు. గల్ల పరీక్ష ద్వారా మైక్రోస్కోపిక్‌ , సిబి నాట్‌ , ఎక్స్‌ రే ద్వారా వ్యాధి నిర్థారణ చేస్తారని, ఇది అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇస్తారన్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు ఆరు నెలల పాటు ఉచిత మందులు ఇస్తారని తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి , పోషకాహార లోపం ఉన్నవారికి, దీర్ఘకాలిక వ్యాది óగ్రస్తులకు, వద్ధులకు, పొగ తాగే వారికి ,సామాజిక బలహీనత ఉన్న వారికి క్షయ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. టీబీ ఉన్న వ్యక్తి సంవత్సర కాలంలో 15 -20 మందికి వ్యాపింప చేసే అవకాశం వుందన్నారు. టిబి రోగి దగ్గినప్పుడు రుమాలు నోటికి అడ్డు పెట్టుకోవాలని, టీబీ రాకుండా ఉండేందుకు పోషకాహారం తినాలని పుట్టిన ప్రతి బిడ్డకు తప్పక బీసీజీ టీకా వేయించాలని రోగి ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయకూడదని తెలిపారు. మందులు క్రమం తప్పక డాక్టర్‌ సూచన మేరకు పూర్తి కాలం మందులు 6 నెలలు వాడితే జబ్బు నయమవుతుందని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలో మందులు ఉచితంగా లభిస్తాయని, క్షయ వ్యాధిగ్రస్తులకు మందులు వాడుతున్న రోజుల్లో 500 రూపాయలు డిబిటి ద్వారా వారి బ్యాంకు అకౌంట్‌ కి పౌష్టికాహార నిమిత్తం ఇస్తారని తెలిపారు. మందులు వాడకుంటే ప్రాణాపాయం ఎదురయ్యే ప్రమాదం వుందన్నారు. టిబి అంతం ప్రతి ఒక్కరి బాధ్యత, టిబి లేని సమాజ స్థాపన ధ్యేయం అని తెలిపారు . త్వరలో పెద్దలకు, నిర్ణయించిన వారికి కూడా టిబి రాకుండా బిసిజీ టీకాల కార్యక్రమం రానుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబి నివారణ అధికారి డాక్టర్‌ వెంకట ప్రసాద్‌, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌, డాక్టర్‌ రవి రాజు, డాక్టర్‌ శిరీష, డాక్టర్‌ సాయి షర్మిల, గుణశేఖర్‌ ,జార్జ్‌ అధికారులు, నర్సింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

➡️