నగరంలో వీధి కుక్కల కట్టడికి చర్యలు

Feb 12,2024 22:53
నగరంలో వీధి కుక్కల కట్టడికి చర్యలు

– 40మందిపై పిచ్చికుక్క దాడి ఘటన బాధాకరంప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: నగరంలో వీధి కుక్కల కట్టడికి తగిన చర్యలు తీసుకుంటామని నగర మేయర్‌ ఎస్‌.అముద, డిప్యూటీ మేయర్‌ ఆర్‌.చంద్రశేఖర్‌, రాజేష్‌కుమార్‌రెడ్డిలు చెప్పారు. నగరంలో ఆదివారం పిచ్చికుక్క దాడిలో 40మంది గాయపడడిన ఘటన దురదష్టకరం.. బాధాకరమన్నారు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం మేయర్‌ ఛాంబర్‌లో ఎంహెచ్వో డా.లోకేష్‌, సానిటరీ ఇన్స్‌పెక్టర్‌లతో సమావేశమై చర్చించారు. వీధి కుక్కల నియంత్రణకు తగిన ప్రణాళిక సిద్ధం చేసి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరంలో కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అన్ని వార్డుల్లో వీధి కుక్కలకు యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్లు వేయడం జరుగుతోందని, కుక్కల జనాభా పెరగకుండా కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించడం జరుగుతుందన్నారు. కుక్కలను నియంత్రించడంలో కొన్ని చట్టపరమైన ఇబ్బందులు వస్తున్నాయని, వాటిని అధిగమించి తగిన చర్యలు తీసుకొనేలా అధికారులకు సూచనలు ఇచ్చామన్నారు. ఆదివారం నాటి ఘటనలోనూ నగరపాలక కమిషనర్‌, ఇతర అధికారులు వేగంగా స్పందించి చర్యలు తీసుకోవడం జరిగిందని, బాధితులను పరామర్శించినట్లు చెప్పారు. మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు వివరించారు.

➡️