నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

Dec 27,2023 22:11

ప్రజాశక్తి- కుప్పం:
కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజులపాటు పర్యటించనున్నట్టు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్‌ కంచర్ల శ్రీకాంత్‌ తెలియజేశారు. బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ కేసులో బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు మొట్టమొదటిసారిగా కుప్పంలో పర్యటించనున్నారని తెలిపారు. ఇందులో భాగంగా గురువారం నాడు హైదరాబాదు నుండి విమానమార్గంలో బయలుదేరి ఉదయం 11గంటల ప్రాంతంలో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోనున్నట్టు తెలిపారు. అక్కడి నుండి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి బెంగళూరు నగరంలో చికిత్స పొందుతున్న టిడిపి నాయకుడు త్రిలోక్‌ నాయుడును పరామర్శించనున్నట్టు తెలిపారు. అనంతరం బెంగళూరు నగరంలో వైట్‌ఫీల్డ్‌ ప్రాంతంలో బెంగళూరు తెలుగుదేశం ఫోరం ఏర్పాటు చేసిన సమావేశంలో హాజరుకానున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలానికి చేరుకోనున్నట్టు తెలిపారు. గుడుపల్లి మండల కేంద్రంలో బహిరంగ సభ అనంతరం కుప్పం పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుండి ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ను కలిసి పరామర్శించనున్నారు. అనంతరం స్థానిక రహదారులు, భవనాలశాఖ అతిధి గహంలో రాత్రి బస చేయనున్నారు. రెండవ రోజు 29వ తేదీ ఉదయం స్థానికుల నుండి వినతిపత్రాలను అందుకోవడంతో ప్రారంభించనున్న ఆయన కార్యక్రమం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండల కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. తదనంతరం రామకుప్పం మండలం పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌కు చేరుకుని ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి కుప్పం చేరుకుని స్థానిక ఎంఎం మహల్‌, బిసిఎన్‌ గ్రాండ్‌ ఇన్‌లలో నాలుగు మండలాలకు చెందిన టిడిపి, జనసేన నాయకులతో ముఖాముఖి సమావేశం కానున్నరన్నారు. సదరు సమావేశాల అనంతరం తిరిగి రహదారులు, భవనాలశాఖ అతిధి గహంలో బసచేయునున్నట్లు తెలిపారు. 30వ తేదీ మూడవరోజు స్థానికుల నుండి వినతిపత్రాలు అందుకోవడంతో ప్రారంభించి గుడుపల్లి మండల పరిధిలోని కురుబ కమ్యూనిటీ భవనానికి చేరుకోనున్నట్టు తెలిపారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి బహిరంగసభ నిర్వహించడంతోపాటు కనకదాస విగ్రహావిష్కరణను చేయనున్నట్టు తెలిపారు. అనంతరం కుప్పం పట్టణంలోని అన్న క్యాంటీన్‌కు చేరుకుని స్వయంగా చంద్రబాబు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. అక్కడినుండి పట్టణంలోని కొత్తపేటలో వెలసియున్న పెద్దపల్లి గంగమాంబ అమ్మవారిని దర్శించుకుని, అలాగే అక్కడికి దగ్గర్లోని మసీదులో దువ్వ నిర్వహించనున్నట్టు తెలిపారు. తదనంతరం మండల పరిధిలోని మల్లానూరు గ్రామానికి చేరుకుని బహిరంగసభలో పాల్గొన్నట్లు తెలిపారు. అక్కడి నుండి బయలుదేరి రోడ్డు మార్గంలో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుని విమానంలో హైదరాబాదుకు చేరుకోవడంతో ఆయన యాత్ర ముగుస్తుందని తెలిపారు.

➡️